మచిలీపట్నంటౌన్: బందరులోని పరాసుపేట శ్రీ సువత్సలా సమేత ఆంజనేయస్వామి దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన సత్రానికి మంగళవారం ఒక కూరగాయల లారీని తిరుమలకు పంపించారు. ఆలయ పాలకవర్గ సభ్యుడు ఐల శివనాగేశ్వరరావు, వారి కుమారుడు దుర్గ సాయి మారుతి కృష్ణ కుమార్, ఆలయ భక్త బృందం ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి దేవస్థానం చైర్మన్ ఆలపాటి రమేష్, కార్యనిర్వాహణాధికారి టి.వి.వి. మోహనరావు, పాలకవర్గ సభ్యులు జెండా ఊపి లారీని ప్రారంభించారు. అలాగే ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో రెండో మంగళవారం సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చెడువ్యసనాలకు బానిసై వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన భవానీపురం స్టేషన్ పరిధిలోని విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాలుగు స్తంభాల సెంటర్‌కు చెందిన ప్రకాష్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రెండేళ్ల క్రితం అతని తల్లి చనిపోయింది. అప్పటి నుంచి తల్లిని తలచుకుని బాధపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో చెడువ్యసనాలకు బానిసయ్యాడు. ప్రతిరోజూ మద్యం, సొల్యూషన్ తాగుతూ పనులకు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. 9వ తేదీ రాత్రి ఎప్పటిలాగే సొల్యూషన్ తాగి వచ్చి పడుకున్నాడు. 10వ తేదీ ఉదయం అతని భార్య శృతి నిద్ర లేచి చూడగా ప్రకాష్ మంచంపై కనిపించలేదు. వంట గదిలోకి వెళ్లి చూడగా హుక్‌కు చీరతో ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. అప్పటికే ప్రకాష్ మృతి చెందాడు. దీనిపై భార్య శృతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.


