52 కేజీల గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన వైనం గంజాయి స్వాధీనంతో పాటు కారు సీజ్
కోనేరుసెంటర్: గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకుని, ఓ కారును సీజ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు మంగళవారం బందరులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తెనాలికి చెందిన మనబోటి ఈశ్వరప్రసాద్, తమిళనాడుకు చెందిన దురై మోహన్‌కుమార్, విశాఖపట్నంకు చెందిన అల్లాఅమీన్ గతంలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తూ గతంలో పోలీసులకు పట్టుబడ్డారు. వీరికి తమిళనాడు జైలులో పరిచయం ఏర్పడింది. ముగ్గురు కలిసి డబ్బు సంపాదించాలన్న ఆశతో గంజాయి అమ్మకాలను యథేచ్ఛగా చేస్తున్నారు. అనేక కేసుల్లో నిందితులుగా ఉన్న వీరిలో ఈశ్వరప్రసాద్‌పై 2022లో టంగుటూరు పోలీస్‌స్టేషన్, 2023లో చైన్నె, 2025లో విజయవాడ పటమట స్టేషన్లలో కేసులు నమోదు కాగా.. జైలు శిక్ష అనుభవించి 2026లో విడుదల అయ్యాడు. అలాగే మోహన్‌కుమార్ 2022లో గంజాయి కేసులో పట్టుబడి జైలు శిక్ష అనుభవించి 2025లో విడుదల అయ్యాడు. వీరితో పాటు అమీన్ గంజాయి వ్యాపారులకు వాహనాలు సరఫరా చేస్తూ చైన్నె పోలీసులకు పట్టుబడి జైలు పాలై 2025లో విడుదల అయ్యాడు.
గంజాయి తరలిస్తుండగా.. ఈ ముగ్గురు విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన బాబూరావు వద్ద కేజీ రూ.5000 చొప్పున 50 కేజీల గంజాయి కొనుగోలు చేశారు. సరుకును తరలించేందుకు పాత కారు కొనుగోలు చేసి తోట్లవల్లూరు మండలం కల్లంవారిపాలెం మీదుగా గంజాయిని తరలిస్తున్నారు. ఎస్‌ఐ కిషోర్‌కు వచ్చిన సమాచారం మేరకు కాపు కాచి వారు వెళ్తున్న కారును అడ్డుకుని సోదా చేయగా సుమారు 52 కిలోల గంజాయి సంచులు పట్టుబడ్డాయి. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి కారును స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గంజాయి ముఠాను పట్టుకున్న సిబ్బందిని ఎస్పీ అభినందించారు.


