సాక్షి ప్రతినిధి, విజయవాడ: అద్విక ట్రేడింగ్ కంపెనీలో లబ్ధి పొంది, ఆ డబ్బు తిరిగి చెల్లించని ముగ్గురు ఏజెంట్లను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కంభంపాటి మధు రూ.5.5కోట్లు, శంకరపు నాని రూ.3.5కోట్లు, నక్కారం బాలాజీ రూ.కోటి మేర అనుచిత లబ్ధి పొందినట్లు గుర్తించి వారిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు.
ఏం జరిగిందంటే..
ట్రేడింగ్ పేరుతో అధిక వడ్డీ ఆశ చూపి.. ఆరు జిల్లాల పరిధిలో 1,450 మంది నుంచి రూ.413 కోట్లు డిపాజిట్లు వసూలు చేసి, వారికి కుచ్చుటోపీ పెట్టారు. ఈ డిపాజిట్ల సేకరణకు 60 మంది ఏజెంట్లను నియమించుకున్నారు. ఇందులో కొంత మంది ఏజెంట్లు లబ్ధి పొందినట్లు పోలీసులు గుర్తించారు. రూ. 144 కోట్లను ముంచేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ప్రధాన నిందితునితోపాటు, మిగిలిన నిందితులకు సంబంధించి 52 ఆస్తులను గుర్తించారు. వీటి విలువ రూ.100 కోట్లకు పైగానే ఉంటుంది. కొంత మొత్తానికి లెక్కలు లేకుండానే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎనిమిది మంది నిందితులు.. కేసులో ప్రధాన సూత్రధారి తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య, ఆయన భార్య సుజాతతో పాటు అనుచిత లబ్ధి పొందిన గాదెం శెట్టి బాలకృష్ణ మూర్తి, ఆయన భార్య నాగలక్ష్మి, చిర్రా రామిరెడ్డి ఆయన భార్య ఝూన్నీ, గుంజి సురేష్, తాడేపల్లి సుధాకర్‌లను అరెస్టు చేశారు. వీరి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి, ఆస్తులను సీజ్ చేశారు. తాజాగా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది జూన్ 26వ తేదీ గణేష్ చంద్ర అనే డిపాజిటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంలోని మాచవరం స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. విజయవాడ క్రైమ్ డీసీపీ తిరుమలేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.
కొనసాగుతున్న గాలింపు..
అద్విక ట్రేడింగ్ కంపెనీ ద్వారా లబ్ధి పొంది, ఆ డబ్బులను తిరిగి కట్టకుండా మరో 15 మంది ఏజెంట్లు తప్పించుకు తిరుగుతున్నారు. వారిపైన పోలీసులు ప్రస్తుతం దృష్టి సారించారు. వారు డబ్బు కట్టక పోతే అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరి ఆస్తులను సీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
అరెస్ట్ అయిన ఏజెంట్లు కంభంపాటి మధు, శంకరపు నాని, నక్కారం బాలాజీ
మరో 15 మంది కోసం కొనసాగుతున్న వేట


