మచిలీపట్నంఅర్బన్: స్థానిక సర్వజన ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా డాక్టర్ టి. లీలా ప్రసాద్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్ టీటీకే రెడ్డి.. డాక్టర్ లీలా ప్రసాద్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా లీలా ప్రసాద్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఎలాంటి సమస్యలైనా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బడ్జెట్ అంశాలను ఉన్నతాధికారులతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. సేవలు మరింత మెరుగుపరచడానికి సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి శుక్రవారం రాత్రి విజయవాడ ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన విజయేంద్ర సరస్వతి స్వామీజీని ఆలయ ఈవో, చైర్మన్, స్థానాచార్య, ప్రధాన అర్చకులు, వేద పండితులు పాదాభివందనం చేసి సాదరంగా స్వాగతం పలికారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి చేరుకున్న స్వామీజీ తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లను, క్రతువులను స్వామీజీ పరిశీలించారు. యాగశాలకు చేరుకున్న స్వామిజీ ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంచి పీఠాధిపతి ఇంద్రకీలాద్రికి విచ్చేశారని తెలుసుకున్న భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు.
ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పుల్లారెడ్డి
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యుత్ వినియోగదారులకు త్వరితగతిన సేవలు అందించాలని ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. శుక్రవారం సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఈలు, ఈఈలతో సమావేశం నిర్వహించారు. దీనిలో ఫీడర్ లెవల్ సోలరైజేషన్, ఎస్సీ,ఎస్టీ వినియోగదారులకు సోలార్ రూఫ్‌టాప్స్ ఏర్పాటు, పీఎం సూర్యఘర్‌పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఏజీఎల్ కనెక్షన్లు, వినియోగదారులకు ఇతర సర్వీసులు అందించాలన్నారు. రెవెన్యూ కలెక్షన్స్ నూరు శాతం సాధించాలన్నారు. లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫీడర్స్ బ్రేక్ డౌన్ కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్(టెక్నికల్) మురళీ కృష్ణయాదవ్, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) టీవీఎస్‌ఎన్ మూర్తి, డైరెక్టర్ (ఫైనాన్స్) వెంకటేశ్వర్లు, సీజీఎం, జీఎంలు పాల్గొన్నారు.
మోపిదేవి: మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని సుప్రీంకోర్టు అడిషనల్ సొలిటర్ జనరల్, మాజీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం నాగ పుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించు కున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదాలు అందించి ఆలయ మర్యాదలతో సత్కరించారు.


