మచిలీపట్నంఅర్బన్: ‘బయటకు వెళ్తారా లేక కేసులు నమోదు చేయాలా?’ అంటూ ఒక పోలీసు అధికారి హెచ్చరించడం ఉద్రిక్తతకు దారితీసింది. సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రం అందజేయడానికి కలెక్టరేట్‌కు వచ్చిన విలేజ్ సర్వేయర్లతో పోలీసులు తీవ్రంగా వ్యవహరించిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్‌కు వినతి పత్రం అందజేయడానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి విలేజ్ సర్వేయర్లు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్‌కు చేరుకున్నారు. సంబంధిత అధికారి సెలవులో ఉండటంతో వారు కలెక్టరేట్ ప్రాంగణంలో వేచి ఉన్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ముఖ్యమైన ప్రతినిధులు మాత్రమే కలెక్టరేట్‌లో ఉండాలని, మిగతా వారు ధర్నా చౌక్ వద్ద వేచి ఉండాలని సూచించారు. వారు అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీంతో విలేజ్ సర్వేయర్లు, పోలీసుల మధ్య కొంతసేపు వాగ్వివాదం చోటుచేసు కుంది. ‘మేము కూడా ప్రభుత్వ అధికారులమే’ అంటూ విలేజ్ సర్వేయర్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయం వెలుపలకు వచ్చిన ఇన్‌చార్జి అసిస్టెంట్ డైరెక్టర్ వి.లీలా ప్రసాద్‌కు వారు వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగింది.
ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ జనవరి 30న మంత్రి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎస్‌ఎస్‌ఎల్‌ఆర్ డైరెక్టర్‌తో జరిగిన చర్చల్లో విలేజ్ సర్వేయర్లకు ఇతర సచివాలయ ఉద్యోగులతో సమానంగా బేసిక్ పే కల్పిస్తామని, స్పష్టమైన ప్రమోషన్ చానల్‌ను ఫిబ్రవరి 15లోపు రూపొందిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఫిబ్రవరి 26న వెలువడిన కమిటీ నివేదికను పరిశీలించినప్పుడు అప్పట్లో ఇచ్చిన హామీలు విలేజ్ సర్వేయర్ల ప్రయోజనాలకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు. ముఖ్యంగా ఇతర సమాన కేడర్ ఉద్యోగులతో పోలిస్తే తక్కువ బేసిక్ పే కేటాయించడం వేతన వ్యత్యాసానికి దారితీసిందన్నారు. ప్రమోషన్ మార్గాలపై నివేదికలో స్పష్టత లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వే వంటి కీలక పనుల్లో అదనపు బాధ్యతలతో అంకితభావంతో పనిచేస్తున్నా తగిన గుర్తింపు లభించడం లేదన్నారు. జనవరి 30న జరిగిన చర్చల సారాంశం మేరకు దానిపై తక్షణమే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
విలేజ్ సర్వేయర్లకు ప్రయోజనాలు లేవు
విలేజ్ సర్వేయర్లకు పోలీసుల హెచ్చరిక
వినతిపత్రం ఇవ్వడానికి జిల్లాలోని
మండలాల నుంచి విలేజ్ సర్వేయర్లు
కలెక్టరేట్‌కు చేరిక
ప్రతినిధులు తప్ప మిగతావారు
బయటకు వెళ్లాలని పోలీసుల సూచన
వెళ్లకపోతే కేసులు నమోదు
చేస్తామని హెచ్చరికతో ఉద్రిక్తం