హత్యకు దారితీసిన పేకాట..
మచ్చుకు కొన్ని ఘటనలు..
● ఎన్టీఆర్ జిల్లాలో యథేచ్ఛగా
పేకాట శిబిరాలు
● మామిడి తోటలు,
అటవీ ప్రాంతాలే అడ్డాలు
● అధికార పార్టీ అండతో
రెచ్చిపోతున్న నిర్వాహకులు
● పోలీసుల దాడులతో ఒక్కొక్కటిగా
వెలుగులోకి వస్తున్న వైనం
జి.కొండూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్టీఆర్ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. గ్రామాల్లో మద్యం, గంజాయి విక్రయాలతోపాటు కోడి పందేలు, పేకాట శిబిరాల నిర్వహణ జోరుగా సాగుతోంది. నిందితులకు అధికారపార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో కట్టడి చేయడం పోలీసులకు సైతం కష్టతరంగా మారింది. ఎన్టీఆర్ జిల్లాలోని రూరల్ ప్రాంతాల్లో ఉన్న మామిడి తోటలు, అటవీ ప్రాంతాలు, పాడుబడిన కోల్డ్‌స్టోరేజీలు, లాడ్జీలలో పేకాట శిబిరాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇరవై రోజులుగా పోలీసులు జరిపిన దాడులలో పదుల సంఖ్యలో నిందితులు, రూ. లక్షల్లో నగదు, భారీగా ద్విచక్రవాహనాలు, కార్లు పట్టుబడడమే ఇందుకు నిదర్శనం. అయితే పోలీసులు శని, ఆదివారాల్లోనే దాడులు జరిపి మిగతా రోజుల్లో జూద శిబిరాలపై దృష్టి సారించకపోతుండటం గమనార్హం
జగ్గయ్యపేటలోని లాడ్జ్జిల్లో పేకాట యథేచ్ఛగా సాగుతున్నట్లు సమాచారం. తెలంగాణ నుంచి వచ్చిన వ్యక్తులు శని, ఆదివారాల్లో ఇక్కడ విచ్చలవిడిగా మద్యం సేవించడం, పేకాట ఆడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఓ కార్పోరేట్ మార్ట్ సమీపంలోని రెండు లాడ్జిల్లో పేకాట ఆడుతూ పలువురు పోలీసులకు పట్టుబడగా, పాడుబడిన కోల్డ్‌స్టోరేజీలలో సైతం పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కంచకచర్లలోని ఓ క్లబ్‌లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో క్లబ్ సభ్యులు వారికి ఇష్టం వచ్చిన సమయంలో గ్రూపుగా ఏర్పడి పేకాట ఆడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్లబ్ అగ్రవర్ణాలకు చెందినది కావడంతో పోలీసులు సైతం అటువైపు కన్నెత్తి చూడలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి.
జూదరుల కోసం గ్రామాల్లో ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు వడ్డీ వ్యాపారుల అవతారమెత్తారు. పేకాట, కోడిపందేల వద్ద ఈ వ్యాపారులు అందుబాటులో ఉండి జూదరులు అధికవడ్డీలకు అప్పులు ఇస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఆయా పందేల్లో గెలిస్తే వెంటనే బాకీ చెల్లించడం లేనిపక్షంలో ఆ బాకీలు తీర్చేందుకు ఇళ్లలోని బంగారం, ఆస్తులు తాకట్టు పెట్టడం జూదరులకు పరిపాటిగా మారింది. దీంతో జూదరుల కుటుంబసభ్యుల మధ్య సైతం వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. జూదరులతోపాటు వారికి అప్పులిచ్చే వ్యక్తులపై కేసులు నమోదు చేస్తే తప్ప ఈ జూదాల కట్టడి సాధ్యం కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
జూదాల్లో వినూత్న పద్ధతులను యువత ఎంచుకుంటున్నారు. ఇప్పటికే పేకాట, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్‌లు కాక సరదాగా గ్రామాల్లో ఆడుకునే ఆటలను సైతం జూద క్రీడలుగా మార్చేస్తున్నారు. యువకులు కొందరు పోగై హైవేల పక్కన టీ స్టాల్స్‌లో కూర్చొని హైవేపై వచ్చే పోయే వాహనాల నంబర్‌ప్లేట్లపై ఉండే నంబర్లను కూడితే ఫలానా నంబరు వస్తుందని కొందరు, అలా రాదని కొందరు బెట్టింగ్‌లకు పాల్పడటం విస్మయానికి గురిచేస్తోంది. ఇటీవల జి.కొండూరు బైపాస్‌రోడ్డులో ఇటువంటి బెట్టింగ్‌కు పాల్పడుతున్న నలుగురు యువకులను, సరదాగా ఇళ్ల వద్ద ఆడుకునే హౌసీ గేమ్‌ను సైతం బెట్టింగ్ గేమ్‌గా మార్చిన కొందరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఈ జూదక్రీడల సంస్కృతి రోజురోజుకు హెచ్చుమీరుతోందనడానికి నిదర్శనం.
ఈనెల ఒకటో తేదీన వత్సవాయి గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.24వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఈనెల ఏడో తేదీన మైలవరం మండలపరిధి పోరాటనగర్ గ్రామశివారులో పేకాట శిబిరంపై పోలీసులు దాడిచేసి తొమ్మిది మంది జూదరులను అరెస్ట్ చేశారు. రూ.1.15లక్షలు నగదు, 49బైక్‌లు పట్టుబడ్డాయి. అదేరోజున రెడ్డిగూడెం మండల పరిధి నాగులూరు శివారు మామిడి తోటలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3.25లక్షల నగదు, నాలుగు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
తొమ్మిదో తేదీన విస్సన్నపేట, నాయకుల గూడెం, జి.కొండూరు మండలంలోని వెల్లటూరు, గంపలగూడెం మండలంలోని తునికిపాడు గ్రామాల్లో పేకాడుతున్న 40మందిని పోలీసులు అరెస్ట్ చేసి రూ.73, 380 నగదును స్వాధీనం చేసుకున్నారు.


