వెలుగు కార్యాలయంలో రికార్డులు తనిఖీ
పెనమలూరు: మండల పరిధిలోని వెలుగు కార్యాలయంలో డ్వాక్రా సభ్యులు చెల్లించిన రుణాల సొమ్ము గోల్‌మాల్ జరిగిన ఘటనపై అధికారులు శనివారం రికార్డులు తనిఖీ చేశారు. పెనమలూరులో ఒక వీవోఏ డ్వాక్రా సభ్యులు చెల్లించిన రుణాల సొమ్ము స్వాహా చేసిన ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై ప్రాథమికంగా తనిఖీ చేయగా రూ.25 లక్షల నిధులు మాయమయ్యాయని తేలింది. పెనమలూరు మండలంలోని ఆరు గ్రామాల్లో 873 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. దాదాపు 8,730 మంది సభ్యులు ఉన్నారు. వీవోఏలు 26 మంది ఉండగా, సీసీలు నలుగురు ఉన్నారు. అయితే డ్వాక్రా సభ్యులు సీ్త్ర నిధి కింద తీసుకున్న రుణాలు స్వాహా అయ్యాయి. పెనమలూరు మండలంలో వీవోఏ 19 గ్రూపు సభ్యులు రుణాల కింద చెల్లించిన రూ.25 లక్షలు స్వాహా చేసినట్లు తేలింది. ఈ ఘటన డ్వాక్రా సభ్యుల్లో కలకలం రేపింది. ‘సాక్షి’లో ఈ ఘటనపై వార్త రావడంతో అధికారులు రంగంలోకి దిగారు. పెనమలూరు గ్రామంలో ఉన్న 300 గ్రూపులకు 9 మంది వీవోఏలు ఉండగా రుణాల కింద సభ్యులు చెల్లించిన నిధుల జమ సక్రమంగా జరిగిందా లేదా అనే విషయమై విచారణ చేపట్టారు.
రుణాల జమలో నిర్లక్ష్యం
మండల పరిధిలో సీ్త్రశక్తి కింద డ్వాక్రా సభ్యులు తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లిస్తున్నారు. వీవోఏలు ఆ రుణాలను గ్రామైఖ్య సంఘాల ద్వారా సీ్త్రశక్తి నిధికి తిరిగి జమ చేయాల్సి ఉంది. అయితే గత కొద్దికాలంగా నిధులు సీ్త్రశక్తి నిధికి సక్రమంగా జమ చేస్తున్నారా లేదా అనే విషయమై సీసీలు, అధికారులు తనిఖీ చేయకుండా నిర్లక్ష్యం చూపించారు. పైగా ఆడిట్‌లు సక్రమంగా చేయలేదన్న ఆరోపణలు సైతం వినబడుతున్నాయి. ఈ కారణంగా సభ్యులు తీసుకున్న రుణాలు తిరిగి సీ్త్రశక్తి నిధికి జమ కాలేదని బట్టబయలైంది.
అధికారుల తనిఖీ
మండల వెలుగు కార్యాలయంలో ఏజీఎం మునిరత్నం, మేనేజర్ కిరణ్‌కుమార్ శనివారం తనిఖీలు చేశారు. డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణాలు, వీవోఏల ద్వారా చెల్లించిన సొమ్ము వివరాలపై రికార్డులు పరిశీలించారు. అధికారులు వివరాలు తెలుపుతూ రూ.25 లక్షలు నిధుల తేడా వచ్చినట్లు గుర్తించామన్నారు. నిధుల రికవరీపై వీవోఏ సునీత, సంఘ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు ఏజీఎం మునిరత్నం తెలిపారు. త్వరలో పీడీ ప్రత్యేక టీమ్ వేసి పూర్తిస్థాయిలో రికార్డులు తనిఖీ చేయిస్తారన్నారు. అయితే రికార్డులు పూర్తిస్థాయిలో బూజుదులిపితే కాని నిధులు ఏ మేరకు గోల్‌మాల్ అయ్యాయో తేలనుంది. ఇంకా నిధులు ఏమైనా గోల్‌మాల్ జరిగాయా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.
గోల్‌మాల్ అయిన నిధులు రూ.25 లక్షలు


