2.75 లక్షల ఎకరాల్లో మినుము సాగుకు
గుడ్లవల్లేరు: కృష్ణా జిల్లాలో రబీ సీజనులో 2.75 లక్షల ఎకరాల్లో మినుము సాగు చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని కొద్ది ప్రాంతాల్లో పెసర, కందులు రకాల సాగుకు కూడా జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. కోత దశకు వచ్చిన వరి చేలల్లో కొందరు రైతులు ఇప్పటికే మినుము, పెసర చల్లుతున్నారు. హార్వెస్టర్లతో వరి కోత కోసిన భూముల్లో ఇప్పటికే మినుము, పెసర విత్తనాలను సాగు చేసేందుకు వేస్తున్నారు. ఈ సాగు నిమిత్తం జిల్లాకు రైతుల అవసరాన్ని బట్టి విత్తనాలు దిగుమతి చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఎన్.పద్మావతి తెలియజేశారు.
జిల్లాలో అవసరతలో 30 శాతం సబ్సిడీ విత్తనాలే...
జిల్లాలో సాగుకు అవసరమైన విత్తనాల్లో 30 శాతం మేరకు మాత్రమే విత్తనాలను ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేయనున్నారు. జిల్లాలో ఎక్కువగా రైతులు తమ సొంత విత్తనాలనే సాగుకు ఉపయోగించుకుంటున్నారు. రైతులు అడిగే ఇండెంట్‌ను బట్టే సబ్సిడీ విత్తనాలను జిల్లాలోని వ్యవసాయాధికారులు, సిబ్బంది సరఫరా చేయనున్నారు. పాసు పుస్తకాలు, ఆధార్ కార్డుల జిరాక్స్‌తో తమ దగ్గరలో ఉన్న స్థానిక ఏఓ కార్యాలయంతో పాటు గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాలకు రైతులు వెళ్తే సబ్సిడీ విత్తనాలు లభిస్తాయి. కౌలుదారులు కూడా తమ కౌలు గుర్తింపు కార్డుల్ని తీసుకువెళ్లి సబ్సిడీ విత్తనాలు పొందవచ్చు.
విత్తనాల రాయితీలు ఇలా...
మినుము విత్తనాలకు సంబంధించి పీయూ 31, ఎల్‌బీజీ – 752, ఐపీయూ 2–43, టీబీజీ – 104, వీబీఎన్ – 8 రకాల విత్తనాలను కిలో రూ.138 చొప్పున ధర ఉండగా రూ.41.40 (30శాతం) సబ్సిడీతో రూ.96.60కు రైతు వాటా కింద పంపిణీ చేస్తున్నారు. పెసర ఐపీఎం 2–14 వంటి రకాల విత్తనాలను కిలో రూ.135 చొప్పున ధర ఉండగా రూ.40.50(30శాతం) సబ్సిడీతో రూ.94.50కు రైతు వాటా కింద అందిస్తు్‌ాన్నరు. కంది విత్తనాలు ఎల్‌ఆర్‌జీ – 52 వంటి రకాలను కిలో రూ.109 చొప్పున ధర ఉండగా రూ.32.85(30శాతం) సబ్సిడీతో రూ.76.65కు రైతు వాటా కింద రైతులకు పంపిణీ చేస్తు్‌ాన్నమని జేడీఏ పద్మావతి తెలిపారు.
కోతకొచ్చిన వరిచేలో మినుము విత్తనాలు జల్లుతున్న రైతు
జిల్లా వ్యవసాయ శాఖ
జాయింట్ డైరెక్టర్ పద్మావతి
2.75 లక్షల ఎకరాల్లో మినుము సాగుకు


