కార్మిక చట్టాల నిర్వీర్యంపై యుద్ధభేరి
కేంద్ర ప్రభుత్వంపై కార్మికుల కన్నెర్ర 26న కార్మికుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డి
మధురానగర్(విజయవాడసెంట్రల్): స్వాతంత్య్రం అనంతరం కార్మికులు సాధించుకున్న హక్కులను హరించేలా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై కార్మికులు యుద్ధభేరి మోగించారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతం రెడ్డి అన్నారు. విజయవాడ భగత్‌సింగ్ రోడ్డులోని వైఎస్సార్ ట్రేడ్‌యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేతన బోర్డులో గతంలో కార్మిక సంఘాల నాయకులు సైతం సభ్యులుగా ఉండేవారని, కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన కార్మిక వ్యతిరేక చట్టాలతో కార్మిక సంఘాలకు వేతన బోర్డులో చోటు లేకుండా చేశారని ఆయన అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి వాటి స్థానే నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్, వాజ్‌పేయి ప్రధానులుగా ఉన్న సమయంలో కార్మిక వ్యతిరేక చట్టాలను అమలు చేయాలని చూస్తే దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం నడిచిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 85.86 లక్షల మంది అసంఘటితరంగ కార్మికులకు మోదీ తీసుకురానున్న నూతన చట్టాలు ఇబ్బందిగా మారుతాయన్నారు. ఉద్యోగ భద్రత, సమాన పనికి సమాన వేతన చట్టాలు హరించే పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మిక వ్యతిరేక శక్తి చంద్రబాబు
మోదీ ఏ విధానం అనుసరిస్తే చంద్రబాబు రాష్ట్రంలో అదే విధానాలను అనుసరిస్తున్నాడని, కార్మిక వ్యతిరేక శక్తిగా చంద్రబాబు మారుతున్నాడని గౌతంరెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఇటువంటి చట్టాలను తీసుకురావడంతోనే 400 పైగా కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోయాయని అన్నారు. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈనెల 26వ తేదీన కార్మికుల ఆందోళన జరగనుందని, ఈ ఆందోళనకు వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సంపూర్ణ మద్దతు తెలుపుతోందన్నారు. రాష్ట్రంలో జరిగే ఆందోళనలో కార్మికులతో కలిసి పాల్గొంటామని, కార్మికులకు అండగా ఉంటామని అన్నారు. కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా కొనసాగిన వైఖరి చరిత్రలో లేదని గుర్తుచేశారు. ఇప్పటికై నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తీరు మార్చుకోవాలని గౌతంరెడ్డి సూచించారు.


