
వరదను సమర్థంగా ఎదుర్కొంటాం
గంటగంటకు కృష్ణానది ఉద్ధృతి పెరుగుతోంది క్షేత్రస్థాయి అధికారులను అప్రమత్తం చేశాం మొదటి ప్రమాద హెచ్చరిక అమలులో ఉంది కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణానది వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతున్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కృష్ణానదిలో వరద ప్రభావం ఎక్కువగా ఉందని, మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశామన్నారు. ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని సంబంధిత మండల అధికారులందరినీ అప్రమత్తం చేశామన్నారు. తోట్లవల్లూరు మండలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఒక ఎస్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రప్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
సిద్ధంగా పునరావాస కేంద్రాలు..
బుడమేరు పరిధిలో కొంత మేర వర్షపాతం నమోదు కావటంతో గత ఏడాది వచ్చిన బుడమేరు వరద తాకిడికి గురైన ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ఆ గ్రామస్తులను అప్రమత్తం చేశామన్నారు. సురక్షిత ప్రాంతాల్లో వరద సహాయక పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయించామని, వరద ఉద్ధృతి మరింత పెరిగితే లంక గ్రామాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారిని తరలించి ఎక్కడ బస ఏర్పాటు చేయాలో ఆర్డీవోలకు సూచించామన్నారు. లంక గ్రామాల్లో ముఖ్యంగా ఎడ్లంకలో వరద ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. గతంలో సంభవించిన వరదల కారణంగా భూమి కోతకు గురవుతోందని, రాష్ట్రస్థాయిలో సెంట్రల్ డిజైన్ కార్యాలయం నుంచి ఒక బృందం ఆ ప్రాంతాన్ని తనిఖీ చేశారని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
కంట్రోల్ రూం ఏర్పాటు..
వరద నేపథ్యంలో బందరులోని కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పారు. ప్రజలు సమాచారం కోసమైనా, సహాయానికైనా 08672–252572 నంబరులో సంప్ర దించవచ్చని సూచించారు. ఇందులో సమన్వయ శాఖాధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తారని చెప్పారు.