డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

Aug 29 2025 7:08 AM | Updated on Aug 29 2025 7:08 AM

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

నిరాశలో అభ్యర్థులు..

మచిలీపట్నం అర్బన్‌: స్థానిక నోబుల్‌ కళాశాలలో డీఎస్సీ–2025 అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. దీని కోసం కళాశాలలో మొత్తం 21 రూంలను ఏర్పాటు చేశారు. అబ్జర్వర్‌ ప్రసన్న కుమార్‌, కృష్ణా జిల్లా డీఈఓ పీవీజే రామారావు, ఎన్టీఆర్‌ జిల్లా డీఈఓ యూవీ సుబ్బారావు పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగింది. మూడు రూంలకు ఒక డీవైఈఓ ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ప్రతి రూములో ఒక ఎంఈఓ, హెచ్‌ఎం, డెప్యూటీ తహసీల్దార్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, ఒక పీడీలను నియమించారు.

మొత్తం 1,048 మందికి..

మొత్తం 1,048 మంది అర్హత పొందిన అభ్యర్థులను మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ పద్ధతిలో పరిశీలనకు విద్యాశాఖ కాల్‌ లెటర్లు జారీ చేసింది. కాల్‌ లెటర్లు అందుకున్న అభ్యర్థులను ఒక్కో రూంలో 50 మంది చొప్పున సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యేలా విభజించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, డిసేబుల్డ్‌ వెల్ఫేర్‌ శాఖల అధికారులు, గురుకుల విద్యాలయాల ప్రతినిధులు బృందాలుగా పాల్గొని పరిశీలన చేస్తున్నారు. అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు అవసరమైన జత పత్రాలను సమర్పించి ధ్రువీకరణ కోసం హాజరయ్యారు. రూంల వద్ద అభ్యర్థుల వివరాలను కంప్యూటరైజ్డ్‌ విధానంలో నమోదు చేయడం వంటి సాంకేతిక సౌకర్యాలను కల్పించారు. విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో అభ్యర్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కృష్ణాజిల్లా డీఈఓ రామారావు తెలిపారు.

డీఎస్సీలో నోటిఫై చేసిన పోస్టులు..

డీఎస్సీ నోటిఫికేషన్‌కు ఉమ్మడికృష్ణా నుంచి మొత్తం 19,953 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వీరిలో 6,543 మంది పురుషులు, 13,410 మంది మహిళలు ఉన్నారు. 1,208 పోస్టులు భర్తీకి విద్యాశాఖ నోటిఫై చేసింది. వీటిలో స్కూల్‌ అసిస్టెంట్‌ 540, ఎస్జీటీ 545, పీఈటీలు 123, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో మరో ఐదు (ఎస్జీటీ 2, స్కూల్‌ అసిస్టెంట్లు 3) పోస్టులు ఉన్నాయి. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో సబ్జెక్టుల వారీగా 39 తెలుగు, 25 హిందీ, 93 ఇంగ్లిష్‌, 52 మ్యాథ్స్‌, 54 ఫిజికల్‌ సైన్స్‌, 142 బయాలాజికల్‌ సైన్స్‌, 135 సోషల్‌, 123 ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌తో పాటు సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 545 పోస్టులున్నాయి.

డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అయితే మెరిట్‌ లిస్టులో ఉన్నప్పటికీ కాల్‌ లెటర్లు రాకపోవడంతో వారు సందేహాలు వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందిస్తూ మెరిట్‌, రోస్టర్‌, ఖాళీల ఆధారంగా మాత్రమే కాల్‌ లెటర్లు పంపించామని స్పష్టం చేశారు. రెండు, మూడు పోస్టులు సాధించిన అభ్యర్థులకు, ఒక్క పోస్టు మాత్రమే, అదీ అభ్యర్థి దరఖాస్తులో చూపిన ప్రాధాన్యతాక్రమం ప్రకారమే అవకాశం ఉండటంతో చాలామందికి కాల్‌ లెటర్లు అందక నిరాశ చెంది వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement