భవానీపురం(విజయవాడపశ్చిమ): విజయవాడ విద్యాధరపురంలోని లేబర్‌కాలనీ గ్రౌండ్ లో డూండీ గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మట్టి మహా గణపతి విగ్రహాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, సమితి నిర్వాహకులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా చవితి వేడుకలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ లక్ష్మీశ అధికారులతో కలసి పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిసేలా.. అన్ని విఘ్నాలు తొలగి జిల్లా, రాష్ట్రం, దేశం సమగ్ర అభివృద్ధి చెందేలా ఆ ఆది దేవుని ఆశీస్సులు ఉండాలని పేర్కొన్నారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఏవో ఎ.శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి విరాళం
భవానీపురం(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో ప్రతి రోజూ జరిగే నిత్యాన్నదాన పథకానికి కృష్ణాజిల్లా పెదపారుపూడి మండలం దోసపాడు గ్రామానికి చెందిన చదలవాడ కోటేశ్వరరావు దంపతులు రూ.1,01,116 విరాళం అందజేశారు. గురువారం ఇంద్రకీలాద్రిపైకి విచ్చేసిన వారు ఆలయ అధికారులను కలిసి విరాళాన్ని అందించారు. అనంతరం దాత కుటుంబానికి అమ్మవారి దర్శనం చేయించారు. వేద పండితులతో వేదాశీర్వచనం తర్వాత అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.
క్వాంటం వ్యాలీతో ఉపాధి అవకాశాలు
కోనేరుసెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటం వ్యాలీతో పుష్కలంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య రాంజీ పేర్కొన్నారు. గురువారం వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ హ్యాకథాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్వాంటం వ్యాలీ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ కుమారి మాట్లాడుతూ ఇంటర్ క్వాంటం వ్యాలీ హ్యాకథాన్‌లో పదహారు టీమ్‌లు పాల్గొనడం శుభపరిణామం అన్నారు. కార్యక్రమానికి డాక్టర్ సల్మా సమన్వయకర్తగా వ్యవరించగా.. కంప్యూటర్ సైన్స్ డీన్ ఆచార్య వైకే సుందర కృష్ణ పాల్గొన్నారు.
సాగర్‌ను సందర్శించిన 23 దేశాల ప్రతినిధులు
విజయపురిసౌత్: అంతర్జాతీయ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ను బుధవారం 23 దేశాలకు చెందిన 27 మంది ప్రతినిధులు సందర్శించారు. నేపాల్, శ్రీలంక, రష్యా, వియత్నాం, జింబాబ్వే, నైజీరియా, తదితర 23 దేశాల ప్రతినిధులు ఈ నెల 15వ తేదీనుంచి హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ‘నూతన ఆవిష్కరణలు–అభివృద్ధి’ అనే అంశంపై శిక్షణ పొందుతున్నారు. ఈ నెల 30వ తేదీతో శిక్షణ ముగియనుంది. దీనిలో భాగంగా టీం కో–ఆర్డినేటర్ డాక్టర్ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో నాగార్జునసాగర్‌ను సందర్శించారు.