
ఆర్టీసీ డ్రైవర్‌పై టీడీపీ నాయకుని దౌర్జన్యం
వీడియో తీస్తున్న కండక్టర్‌పై కూడా దాడి
చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నిమ్మకూరు గ్రామంలోతన ఇంటి వద్ద బస్సు ఆపలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేత, మాజీ సర్పంచ్ జంపాన వెంకటేశ్వరరావు దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా డ్రైవర్ సీటు నుంచి అతడిని కిందకు లాగేందుకు యతి్నంచాడు. బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆపబోమని, రిక్వెస్ట్ స్టాప్‌లు ఎక్కడ ఉంటే అక్కడే ఆపుతామని డ్రైవర్ ఆ నాయకుడికి చెబుతున్నా వినిపించుకోకుండా డ్రైవర్‌పై దాడి చేశాడు.
ఈ ఘటనను వీడియో తీస్తున్న కండక్టర్‌పై కూడా దాడి చేసేందుకు వెంకటేశ్వరరావు ప్రయత్నించాడు.టీడీపీ నేత దౌర్జన్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్‌కు టీడీపీ నేత క్షమాపణ చెప్పాలని, లేకపోతే తమ సంఘాల తరఫున క్షమాపణ చెప్పేంత వరకు ఉద్యమిస్తామని ఆర్టీసీ ఉద్యోగుల సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై పామర్రు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేస్తారా, లేదా కూటమి నాయకుల సిఫార్సులకు తలొగ్గి రాజీ ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాల్సిందే.