
అభివృద్ధి పనుల్లో కొండంత నిర్లక్ష్యం
దుర్గగుడి పనుల్లో కనిపించని పురోగతి దసరాకు పూర్తయ్యేనా?
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కొండంత నిర్లక్ష్యం కనిపిస్తోంది. అభివృద్ధి పనులను తరచూ పరిశీలిస్తున్న దేవదాయశాఖ కమిషనర్ రామచంద్రమోహన్.. వీటిని త్వరగా చేయాలని ఆదేశాలిస్తున్నా ఆచరణలో పురోగతి కనిపించడం లేదు. శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థాన మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా మహా మండపం దిగువన అన్నదాన భవనం, ప్రసాదాల పోటుతో పాటు వెలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా ఉత్సవాల వేళకు అన్నదాన భవనం, ప్రసాదాల పోటును వినియోగంలోకి తీసుకురావాలన్నది లక్ష్యం.
ఆ భవనాలు అందుబాటులోకొస్తే..
ఆయా భవనాలు అందుబాటులోకి వస్తే ఆలయ ప్రాంగణంలోనే ప్రసాదాల తయారీ, అన్న ప్రసాద తయారీ, భక్తులకు అన్న ప్రసాద వితరణ, ఆలయ ఉద్యోగులకు అన్న ప్రసాద వితరణ వాటిలో నిర్వహించే వీలు కలుగుతుంది. దీంతో దేవస్థానానికి కోట్ల రూపాయలు ఆదాతో పాటు సమయం కలిసి వస్తుంది. ఆయా భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. నెలలో మూడు సార్లు కమిషనర్ పరిశీలించినా అధికారులు మాత్రం పనుల్లో వేగం పెంచడం లేదు.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..
దసరా ఉత్సవాలు మరో నెల రోజులు మాత్రమే ఉండగా, ఇంకా అన్నదానం, ప్రసాదాల పోటు భవన నిర్మాణ పనులు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. రూ. కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న ప్రసాదం పోటు, అన్నదానం భవనాలు ఈ దసరా ఉత్సవాలకు అందుబాటులోకి వస్తాయా అనే అనుమానం కమిషనర్ సైతం వ్యక్తం చేయడం గమనార్హం.
కమిషనర్ మాట పెడచెవిన...!
గత నెల 30న దేవదాయ శాఖ కమిషనర్ , దుర్గగుడి అధికారులు అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. యాగశాలను ప్రారంభించి ఏడాది అవుతున్నా ఇంత వరకు తుది పనులు పూర్తి కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. యాగశాల చుట్టూ కారిడార్‌ను అభివృద్ధి చేసి శ్రావణ మాసంలోనైనా యాగాలు నిర్వహించాలని సూచించారు. అయితే కమిషనర్ ఆదేశాలను పట్టించుకోలేదు. శ్రావణ మాసం పూర్తి కావడంతో ఆదివారం కమిషనర్ వచ్చినా కొండపైకి రాకుండా జాగ్రత్తలు పడ్డారు. యాగశాలలో మరి కొన్నిపనులు మిగిలి ఉండటంతో దసరా నాటికి కూడా అనుమానమే అని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇక యాగశాల పక్కనే ఉన్న పూజా మండపాలను పరిశీలించిన కమిషనర్ లోపల గోడలకు ఎరుపు రంగు ఉన్న గ్రానైట్‌ను వేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా డీఈపై ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వీటిని మార్చాలని ఆదేశించినా ఆయన మాటలు పెడచెవినపెట్టారు,
పనుల తీరుపై ఆరా
ఆదివారం కమిషనర్ మరోసారి అభివృద్ధి పనులను పరిశీలించారు. కనకదుర్గనగర్ నుంచి నేరుగా అన్నదానం, ప్రసాదాల పోటు, మల్లేశ్వరాలయం నుంచి అన్నదాన భవనానికి చేరుకునే మెట్ల మార్గంలో పనులను కమిషనర్ పరిశీలించారు. దసరా ఉత్సవాల నాటికి ఆయా భవనాలు ఏ మేరకు అందుబాటులోకి వస్తాయని ఇంజినీరింగ్ అధికారులను ఆరా తీశారు. అనంతరం మహామండపం నాలుగో అంతస్తులోని ఈవో చాంబర్‌లో అభివృద్ధి పనులు, దసరా ఉత్సవాల ఏర్పాట్లు, పనుల అంచనాలపై సమీక్షించారు. కమిషనర్ వెంట దుర్గగుడి ఈవో శీనానాయక్, ఈఈలు కోటేశ్వరరావు, రాంబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.