
పురుగు మందు తాగి రైతు ఆత్మహత్యాయత్నం
పొలం గట్ల విషయంలో తలెత్తిన వివాదమే కారణం పోలీసులు న్యాయం చేయలేదనే మనస్తాపంతోనే పీఎస్ ఎదుట ఘటన
కోడూరు: పోలీస్‌స్టేషన్ ఎదుట ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దివిసీమలో జరిగింది. పొలం గట్ల విషయమై ఇద్దరు రైతుల మధ్య తలెత్తిన వివాదంలో తనకు పోలీసులు అన్యాయం చేశారని ఓ రైతు మనస్తాపంతో స్టేషన్ వద్దే పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆదివారం సాయంత్రం కోడూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సేకరించిన వివరాల మేరకు.. కోడూరు గ్రామానికి చెందిన చిట్టిప్రోలు నరసింహరాజుకు జరుగువానిపాలెం గ్రామానికి చెందిన జరుగు వెంకటేశ్వరరావుకు జరుగువానిపాలెంలో సమీపంలో ఉన్న పొలం మధ్య గట్ల విషయంలో కొంతకాలంగా వివాదం ఉంది. వారిద్దరి మధ్య అనేకసార్లు ఘర్షణలు కూడా జరిగాయి. ప్రస్తుతం వ్యవసాయ పనులు జరుగుతుండగా ఇద్దరు రైతుల పొలాల మధ్య ఉన్న గట్టును వెంకటేశ్వరరావు తొలగించాడు. దీంతో ఈ విషయంపై నరసింహరాజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఈ విషయాన్ని పట్టించుకోకుండా వెంకటేశ్వరరావుకు కొమ్ముకాశారు. ఇదే అదునుగా చేసుకొని వివాదం పరిష్కారం కాకుండానే వెంకటేశ్వరరావు తన పొలంలో శనివారం వరినాటు వేశాడు.
పోలీసులు పరిష్కరించలేదనే..
పోలీసులు తన సమస్యను పరిష్కరించలేదంటూ మనస్తాపానికి గురైన నరసింహరాజు ఆదివారం సాయంత్రం తన వెంట తీసుకువెళ్లిన పురుగు మందును స్టేషన్ ఎదుట తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నరసింహరాజు పురుగు మందు తాగుతున్న సమయంలో అవనిగడ్డ సీఐ యువకుమార్ కూడా స్టేషన్‌లోనే ఉన్నారు. బాధితుడిని పోలీసులే హుటాహుటిన అవనిగడ్డలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పొలం గట్ల విషయంలో పోలీసులు న్యాయం చేయకపోగా తనపైనే తిరిగి కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించారని, దీంతో మనస్తాపం చెందిన పురుగు మందు తాగినట్లు బాధితుడు నరసింహరాజు తెలిపాడు.
కేసు నమోదు చేయని పోలీసులు
ఘటనపై కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు మీడియాకు తెలిపారు. కోడూరు పోలీసులు ఆస్పత్రికి వచ్చి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారని, కేసు నమోదు చేయకపోవడంపై బాధిత రైతు నరసింహరాజు ఆవేదన వ్యక్తం చేశాడు.