
ఎడ్లంకకు వంతెన నిర్మించండి
మూడవ రోజుకు చేరిన ఎడ్లంక వాసుల నిరసన దీక్ష స్పందించని పాలకులు నేటి నుంచి అవనిగడ్డలో దీక్ష స్పందించకుంటే కలెక్టరేట్ వద్ద నిరశన
చాలా భయమేస్తోంది
ఎడ్లంక(అవనిగడ్డ): వరదల కారణంగా నదీకోతతో కనుమరుగవుతున్న గ్రామాన్ని కాపాడమంటున్నారు ఎడ్లంకవాసులు. ఆరు గాలం కష్టించి కట్టుకున్న ఇల్లు నదిలో కలసిపోకుండా రక్షించాలంటున్నారు. వరద వచ్చినపుడల్లా కోతకు గురవుతున్న రహదారి స్థానంలో వంతెన నిర్మించాలంటున్నారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎడ్లంక గ్రామస్తులు చేపట్టిన నిరసన దీక్ష ఆదివారానికి మూడో రోజుకి చేరింది. అయినా పాలకులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్పష్టమైన హామీ వచ్చేవరకూ దీక్ష కొనసాగిస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. మూడు రోజులుగా ఎడ్లంకలో చేపట్టిన దీక్షను సోమవారం నుంచి అవనిగడ్డకు మార్చనున్నారు. అయినా పాలకులు, ఉన్నతాధికారులు స్పందించకపోతే జిల్లా కేంద్రం మచిలీపట్నంలో కలెక్టరేట్ వద్ద దీక్ష చేసేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నారు.
మూడో రోజుకు చేరిన దీక్ష
ఎడ్లంక గ్రామస్తులు చేపట్టిన నిరసన దీక్ష ఆదివారం మూడో రోజుకు చేరింది. 5వ వార్డు మెంబర్ వనమాలి విజయ్‌బాబు, పెమ్మాడి నాంచారయ్య, మునిపల్లి లాజరు, బందెల లక్ష్మణ్, కొల్లు గోపాలకృష్ణ, పెమ్మాడి నాంచారమ్మ, లక్ష్మీ, కర్రా మరియమ్మతో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామస్తుడు, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు దోవా గోవర్ధన్ మూడు రోజులూ దీక్షలో పాల్గొని మద్దతు తెలిపారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరుడు, న్యాయవాది గౌతమ్ ఆదివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.
గత ప్రభుత్వంలో వంతెన కోసం రూ.8.50 కోట్లతో ప్రతిపాదనలు
రెండో రోజు దీక్షకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్‌బాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు మద్దతు ఇచ్చిన విషయం విదితమే. గత ప్రభుత్వంలో వంతెన కోసం రూ.8.50 కోట్లకు ప్రతిపాదనలు పంపామని, ఈ ప్రభుత్వం దానిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
కన్నెత్తి చూడని కూటమి నేతలు
ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగినా అక్కడ వాలిపోయే కూటమి నాయకులు తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని మూడు రోజులుగా దీక్ష చేస్తున్నా ఒక్క నాయకుడు గానీ, ప్రజాప్రతినిధి గానీ అటువైపు కన్నెత్తి చూడక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాన్ని కాపాడేవరకూ పోరాడతామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలనే అమలు చేయాలంటున్నామని అయినా స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎడ్లంక గ్రామస్తుల డిమాండ్‌లు ఇవే
వరదతో ఇళ్ల దగ్గర వరకు కోతకు గురవడంతో రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదు. మట్టి పెళ్లలు విరిగి పడినపుడల్లా పెద్ద శబ్దం వస్తుండటంతో చాలా భయమేస్తోంది. తెల్లారితే చాలు అనుకుంటూ బిక్కు బిక్కు మంటూ బతుకుతున్నాం. అధికారులు స్పందించి గ్రామానికి రక్షణ గోడ, వంతెన నిర్మించాలి.
– చక్కా పోచమ్మ, ఎడ్లంక