
మధుమేహుల జీవితాల్లో కొత్త వెలుగులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మధుమేహ చికిత్సల్లో అందుబాటులోకి వచ్చిన అధునాతన విధానాలు, వ్యాధిగ్రస్తుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నాయని న్యూ ఢిల్లీకి చెందిన డయాబెటాలజిస్ట్ డాక్టర్ అమర్‌పాల్ సింగ్ అన్నారు. యలమంచి డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డయాబ్ ఎండోకాన్ 2025 సదస్సు విజయవాడలోని ఓ హోటల్‌లో ఆదివారం జరిగింది.
సదస్సును డాక్టర్ అమర్‌పాల్ సింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మధుమేహ చికిత్సలో ఆధునిక విధానాలను వివరించారు. మధుమేహ నియంత్రణలో గట్ మేనేజ్మెంట్, ఆధునిక చికిత్సలతో డీ–యాక్సలరేషన్ మందుల వినియోగం తగ్గించడం, ఏఐ టెక్నాలజీ వినియోగం, టైప్–1 డయాబెటిస్ భవిష్యత్ చికిత్సలు, మధుమేహం ముప్పును వాయిదా వేయడం, కిడ్నీ వ్యాధులను తిప్పికొట్టడంపై వివరించారు. జీఐపీఆర్ ట్రీట్మెంట్‌తో రక్తకణాల వ్యవస్థను సంరక్షించడం, ఆస్టియో పోరోసిస్ నిర్వహణ, ఫాటీ లివర్ నిర్ధారణ–చికిత్సలు, లాంగివిటీ ఇన్ డయాబెటిస్, అడల్ట్ వ్యాక్సినేషన్, క్యాన్సర్ మందుల క్యాన్సర్ మందుల కారణంగా సంతాన లేమి వంటి అనేక కీలక అంశాలను డాక్టర్ అమర్‌పాల్‌తో పాటు పలువురు నిపుణులు విశ్లేషణాత్మకంగా వివరించారు. నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ సదాశివరావు మాట్లాడుతూ.. శరీర బరువును అదుపులో ఉంచుకుంటే మధుమేహాన్ని నియంత్రించుకోవడంతో పాటు గుండె జబ్బుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. సదస్సులో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ అమర్‌పాల్‌సింగ్‌కు గోల్డ్‌మెడల్‌ను ప్రదానం చేశారు. డాక్టర్ హిమన ఐశ్వర్య, అమూల్య తదితరులు పాల్గొన్నారు.
న్యూ ఢిల్లీకి చెందిన డయాబెటాలజిస్ట్
డాక్టర్ అమర్‌పాల్ సింగ్