
పొంచి ఉన్న వాయు‘గండం’!
రైతును తేరుకోనివ్వని వరుణుడు
అవనిగడ్డ: ఒకవైపు వర్షాలు, మరోవైపు వరదతో నదీ తీర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు మంగళవారం అల్పపీడనం వాయుగుండంగా మారనుందనే వార్తలు మరింత కలవర పాటుకు గురిచేస్తున్నాయి. వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షం ముంపు నుంచి ఇంకా పంటలు తేరుకోలేక పోవడమే అందుకు కారణం. మరోసారి వరద పెరగనుందనే హెచ్చరికలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తీవ్రవర్షాల వల్ల పంటలు మునగడంతో ఆందోళన చెందుతున్న రైతులను వాయుగండం మరింత కలవర పెడుతోంది.
16,977 ఎకరాల్లో పంట నీటి మునక..
కృష్ణాజిల్లాలో ఈ ఖరీఫ్‌లో 2.62లక్షల ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. గత మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షం పడటంతో వరిపొలాలు నీటమునిగాయి. జిల్లా వ్యాప్తంగా 16,977 ఎకరాల్లో వరిపొలాలు నీటమునిగినట్టు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అత్యధికంగా 11,075 ఎకరాల్లో పంట నీటమునిగినట్టు చెప్పారు. ఆరు రోజులుగా వరిపొలాలు, నారుమళ్లు నీటమునిగి ఉండటంతో చనిపోతున్నాయని రైతులు చెప్పారు.
పెరగనున్న వరద తీవ్రత..
అల్పపీడనం వల్ల ఆదివారం రాత్రి నుంచి పలుచోట్ల వర్షాలు పడుతూనే ఉన్నాయి. మంగళవారం అల్పపీడనం వాయుగుండంగా మారనుందనే వార్తలు రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు రెండు రోజుల క్రితం తగ్గిన వరద మళ్లీ పెరిగింది. ప్రకాశం బ్యారేజీ నుంచి ప్రస్తుతం 2.84లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదలగా, మంగళవారం 3.97లక్షలు, బుధవారానికికు ఏడు లక్షలకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకేసారి వానలు, వరద రావడంతో మురుగునీరు సముద్రంలోకి లాగడం లేదని రైతులు తెలిపారు. ఈ కారణంగానే ఆరు రోజులవుతున్నా ఇంకా చాలాచోట్ల పంటపొలాలు ముంపులోనే ఉన్నట్టు బాధిత రైతులు చెప్పారు.
కొనసాగుతున్న వానలు..
సోమవారం జిల్లాలో కోడూరులో అత్యధికంగా 20 మి.మీ వర్షపాతం నమోదైంది. నాగాయలంకలో 16.8, చల్లపల్లి, మోపిదేవిలో 9.2, ఘంటసాలలో 7.2, కృత్తివెన్నులో 5.4, మచిలీపట్నంలో 4.8, అవనిగడ్డలో 4.2, బంటుమిల్లిలో 3.6,పెడనలో అత్యల్పంగా 1.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజులు వానలు కొనసాగవచ్చని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
మళ్లీ పెరుగుతున్న వరద
ఇంకా ముంపులోనే పంట పొలాలు
వరద ఎఫెక్ట్‌తో ఎగదట్టిన సముద్రం
తీర ప్రాంతాల్లో ఏకమైన డ్రెయిన్లు, పొలాలు
జిల్లాలో 16,977 ఎకరాల్లో నీట మునిగిన వరి

పొంచి ఉన్న వాయు‘గండం’!