
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
కంచికచర్ల: ఓ మహిళ అనుమానాస్పదంగా మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడు హత్య చేశాడా లేక ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందా అని పోలీసులు విచారిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామానికి చెందిన కంభం భవానీ(28) అలియాస్ రజినీకి వీరులపాడు మండలం అల్లూరు గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే వ్యక్తితో 12ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు మగ సంతానం ఉన్నారు. రాజశేఖర్ పేరకలపాడులో ఉంటూ కంచికచర్ల గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే భవానీ కంచికచర్లలోని సంజీవయ్ నగర్‌లో నివాసముంటున్న జంగా ప్రకాశరరావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భర్త రాజశేఖర్ నెల రోజుల క్రితం ఇద్దరు పిల్లలను తీసుకుని అల్లూరులో విడిగా ఉంటున్నాడు. భవానీ మాత్రం చిన్న కుమారుడితో పేరకలపాడులోని తల్లి వద్ద ఉంటోంది.
16న ప్రియుడితో గొడవ..
పది రోజుల క్రితం భవానీ తల్లి వేరే గ్రామంలో ఉంటున్న తన పెద్ద కుమార్తె వద్దకు వెళ్లింది. ఈనెల 16న పేరకలపాడులో అర్ధరాత్రి సమయంలో ప్రకాశరావుకు భవానీ మధ్య గొడవ జరిగింది. కానీ భవానీ ఈనెల 17వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. భవానీ మేన అత్త అయిన బురదగుంట దుర్గా భవానీ ఇంట్లోకి వెళ్లి చూసి, ఆమెను స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతిచెందింది. అయితే ప్రకాశరావు 17వ తేదీ అర్ధరాత్రి భవానీ ఇంటికి వచ్చాడని దుర్గా పోలీసులకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి ప్రియుడు ప్రకాశరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం భవానీ మృతదేహానికి పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మేన అత్త దుర్గా ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పి. విశ్వనాథం తెలిపారు.
ప్రియుడు ప్రకాశరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు