
వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే భయం
వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర
భవానీపురం(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాల ప్రవేశంపై కూటమి ప్రభుత్వం జారీ చేసిన నిషేధపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల అంబేడ్కర్ విగ్రహం ముందు వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిరసన ధర్నా నిర్వహించారు. విద్యార్థి నేతలు అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లోనే విద్యారంగాన్ని నీరుగార్చిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే విద్యార్థి సంఘాలను ప్రభుత్వ విద్యాసంస్థ ల్లోకి రాకుండా చీకటి ఉత్తర్వులు ఇచ్చిందని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సంఘాలతో సమావేశాలు నిర్వహించిన లోకేష్ నేడు ఇలాంటి ఉత్తర్వులను ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలే..
విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేసేది విద్యార్థి సంఘాలేనని రవిచంద్ర తెలిపారు. మెగా పేరెంట్, టీచర్ మీటింగ్‌లను రాజకీయ ఈవెంట్‌లుగా మార్చిన ఘనత చంద్రబాబు, లోకేష్‌లదేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలలు, కళాశాలల్లో కలుషిత ఆహారం వల్ల విద్యార్థులు ఆస్పత్రుల పాలవుతున్నా లోకేష్ స్పందించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివారెడ్డి, సహాయ కార్యదర్శి బి. కొండలరావు, జిల్లా అధ్యక్షుడు జె. కోమల్ సాయి పాల్గొన్నారు.