
సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యం
ఎస్పీ గంగాధరరావు
చిలకలపూడి(మచిలీపట్నం): మీ కోసంలో వచ్చిన సమస్యలు ఏమైనా చట్టపరిధిలో పరిష్కరించడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం సిద్ధంగా ఉంటుందని ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం ద్వారా అర్జీలను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ మీకోసంలో ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని..
● అవనిగడ్డకు చెందిన సత్యనారాయణ తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తిని తన సోదరులు అక్రమంగా అనుభవిస్తున్నారని ఆరోపించారు. వారిని ప్రశ్నిస్తే చంపాలని చూస్తున్నారని, దొంగ దస్తావేజులు సృష్టించి ఆస్తి కాజేయాలని చూడటమే కాకుండా ఇంటికి కూడా రాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఎస్పీకి అర్జీనిచ్చారు.
● గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడుకు చెందిన పద్మావతి తనకు వివాహం జరిగి 11 ఏళ్లు అయ్యిందని.. ఇద్దరు మగ సంతానం కూడా ఉన్నారన్నారు. తన భర్త రెండేళ్లుగా వేరే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని తనను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని వాపోయారు. పెద్దల్లో పెట్టినప్పటికీ ప్రయోజనం లేదని న్యాయం చేయాలని కోరుతూ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
● గన్నవరానికి చెందిన ఓ వివాహిత తనకు వివాహం జరిగి నాలుగేళ్లు అవుతోందని అత్తమామలు మొదట్లో భాగానే ఉన్నా, తరువాత అకారణంగా ఆస్తి కోసం తన భర్తను, తనను ఇబ్బందులు పెడుతున్నారని వివరించారు. తమ ప్రమేయం లేకుండా ఆస్తులను అమ్మకాలకు పెడుతూ, ప్రశ్నిస్తే తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని న్యాయం చేయాలని అర్జీనిచ్చారు.