దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు

May 15 2025 2:13 AM | Updated on May 15 2025 2:47 PM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు భక్తులు హుండీల ద్వారా రూ.3.73 కోట్ల నగదు కానుకలు, ముడుపులు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. ఆది దంపతులకు భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 23 రోజులకు గాను మొత్తం రూ.3,73,37,549 నగదు, 420 గ్రాముల బంగారం, 7.020 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈఓ శీనానాయక్‌ పేర్కొన్నారు. కానుకల లెక్కింపును దేవదాయ శాఖ అధికారులు, ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది పర్యవేక్షించగా, ఆలయ అధికారులు, సిబ్బంది, సేవా సిబ్బంది పాల్గొన్నారు.

దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టుచీర సమర్పించిన సిరిసిల్ల నేతన్న

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయ వాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం సిరిసిల్లకు చెందిన చేనేత కార్మికుడు నల్ల విజయ్‌కుమార్‌ అగ్గిపెట్టెలో ఇమిడ్చిన పట్టుచీరను సమర్పించారు. దుర్గగుడికి బుధవారం చేరుకున్న విజయ్‌కుమార్‌ అగ్గిపెట్టెలో తెచ్చిన పట్టుచీరను ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు. తొలుత అమ్మవారి దర్శనానికి విచ్చేసిన విజయ్‌కుమార్‌ కుటుంబానికి ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ సుమారు వంద గ్రాముల బరువు కలిగిన పట్టుచీర ఐదున్నర మీటర్లు, 48 ఇంచుల వెడల్పున తయారు చేశామన్నారు. తమ కుటుంబం నుంచి ప్రతి రెండేళ్లకో సారి అమ్మవారికి పట్టుచీరను తయారు చేసి అందిస్తున్నామన్నారు. అనంతరం ఆలయ ఈవో శీనానాయక్‌ విజయ్‌కుమార్‌కు అమ్మవారి ప్రసాదాలను అందించారు.

దసరా లోగా చేనేత సొసైటీలకు ఎన్నికలు

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో దసరా పండుగ లోగా చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్‌ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌.సవిత తెలిపారు. చేనేతలకు త్వరలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అమలు చేయనున్నామని చెప్పారు. లబ్బీ పేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాలులో బుధవారం మంత్రి సవిత చేనేత కార్మికులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత చేనేత కార్మికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేనేత వస్త్రాలను మూడు నెలలకు ఓ సారి ఆప్కో ద్వారా కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారంలో ఒక రోజు చేనేత దుస్తులు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్‌ రేఖారాణి, సెర్ఫ్‌ సీఈఓ కరుణ, ఆప్కో ఎండీ విశ్వ తదితరులు పాల్గొన్నారు.

ఎవరినీ ఉపేక్షించం : హోంమంత్రి

ఉయ్యూరు రూరల్‌: రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అవినీతి అక్ర మాలకు పాల్పడినా వారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉయ్యూరు గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌ను బుధవారం ఆమె ప్రారంభించారు. అనంతరం విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎవరికీ భయపడదని, తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదన్నారు. త్వరలో నూజివీడు వద్ద పోలీస్‌ ట్రైనింగ్‌ అకాడమీ, విజయ నగరం జిల్లాలో గ్రాండ్‌ ట్రైనింగ్‌ అకాడమీ నిర్మించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ పాల్గొన్నారు.

దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టుచీర1
1/2

దుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టుచీర

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు 2
2/2

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement