కళ్లెదుటే భర్త, కన్నకూతురు, తోడబుట్టిన తమ్ముడు చనిపోతే..

- - Sakshi

విషాదం నుంచి మొదలై.. 
కళ్లెదుటే భర్త, కన్నకూతురు, తోడబుట్టిన తమ్ముడు చనిపోతే.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అచేతనంగా పడి ఉంటే.. ఎవరైనా ఏం చేస్తారు? జీవితాంతం ఆ విషాద ఘటనను గుర్తు చేసుకుని జీవశ్చవంలా మారిపోతారు. గుండెల్ని పిండేసే ఆ ఘటన తలచుకుంటేనే హృదయం ద్రవించిపోతోంది. మరీ. కళ్లారా చూసి ఆ ఘోరాన్ని భరించాలంటే ఆ బాధ వర్ణనాతీతం.

కానీ సరిగ్గా అటువంటి విషాద సంఘటనే ఆమె జీవితంలో చోటు చేసుకుంది. కానీ అందరిలా విధి రాత, తలరాత అనుకుంటూ ఆమె కుమిలిపోతూ కూర్చోలేదు. బతికి ఉన్న కొడుకులో భర్త, కూతురు, తమ్ముడిని చూసుకుంటూ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. తండ్రి ఇచ్చిన మనోధైర్యంతో విజయతీరాలకు చేరారు టెకీ విజయగౌరి. బాధను దిగి మింగి ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు ఉన్నత చదువులు చదివి పీహెచ్‌డీ పూర్తి చేసింది. ప్రస్తుతం రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె జీవన పోరాటాన్ని ఆమె మాటల్లోనే విందాం..

కుటుంబ నేపథ్యం..
మాది విశాఖపట్నం గాజువాక. నాన్న కృష్ణారావు డాక్‌ యార్డ్‌లో ఉద్యోగి. అమ్మ లక్ష్మీ గృహిణి, కుటుంబ, ఆర్థిక కట్టుబాట్ల కారణంగా ఇంటర్‌ పూర్తి కాగానే పెళ్లి చేశారు. 1992లో సూర్యప్రకాష్‌తో వివాహమైంది. భర్త ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఇద్దరు పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతోంది. చదువుపై ఉన్న శ్రద్ధతో ఆయన సహకారంతో 2000లో దూరవిద్యలో ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను.

2002లో హిందీ బీఈడీలో సీటు వచ్చినప్పటికీ వదులుకోవాల్సి వచ్చింది. ఎంఏ (పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌) పూర్తి చేశాను. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా విషాదం. సంకాంత్రి పండుగ వేళ 2003 జనవరి 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త, కూతురు, తమ్ముడు చనిపోయారు. నేను, ఆరేళ్ల మా బాబు కోమాలోకి వెళ్లాం. అయితే మా అత్తింటి వారు నా భర్త, పాప మృతదేహాలు మా పుట్టింటి వద్దే వదిలివెళ్లిపోయారు. అప్పటి నుంచి మా పుట్టింట్లోనే అమ్మా నాన్న వద్దే ఉంటున్నాను.

2004లో కారుణ్య నియామకం..
నా భర్త ఉపాధ్యాయుడు కావడంతో కారుణ్య నియామకాల్లో 2004 ఏప్రిల్‌ 3న సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి గ్రామంలో పోస్టింగ్‌. అయితే జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం కంటే సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ ఉద్యోగానికి జీతం ఎక్కువ కావడం, కారుణ్య నియామకం కింద టీచర్‌గా పోస్టింగ్‌ ఇవ్వడం సరికాదని, దీనికి సంబంధించి సెప్టెంబర్‌ 2002 ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, తెలుసుకోకుండా పోస్టింగ్‌ ఇచ్చారని సరెండర్‌ చేశారు. దీంతో మళ్లీ ఒంటరి పోరాటం ప్రారంభం అయ్యింది.

పిల్లాడి చదువు, ఇంటిపోషణ చూసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. నవంబర్‌, 2005లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇచ్చారు. నాన్న ఇచ్చిన ధైర్యంతో ఉద్యోగం చేస్తూనే పట్టు వదలకుండా చదువు కొనసాగించాను. పీహెచ్‌డీ చేయాలనే అభిరుచి, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇంగ్లిషు అభివృద్ధి చేసి, సేవ చేయాలనే ఆలోచనతో ఎంఏ ఇంగ్లిష్‌లో పోస్ట్‌ గ్రాడ్యూయేషన్‌ పూర్తి చేశాను. ఆ తర్వాత కృష్ణా యూనివర్సిటీలో పీహెచ్‌డీలో జాయిన్‌ అయ్యాను. 2023 మార్చి 29న డాక్టరేట్‌ పొందాను.

ఎందరో ప్రోత్సాహం..
నా జీవిత ప్రయాణంలో విజయనగరం నుంచి రాజ్‌భవన్‌ వరకు ఎందరో వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రత్యేకంగా డాక్టర్‌ ఎన్‌.అప్పారావు, డాక్టర్‌ మోహన్‌రావు, సీహెచ్‌ ప్రసాదరావు, ఎం. కోటేశ్వరరావుకు ధన్యవాదాలు. నా కొడుకు శశిధర్‌ ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్నాడు. మా నాన్నకు డాక్టరేట్‌ అంకితమిస్తున్నా.

నాన్న ఇచ్చిన ధైర్యంతో..
ఒంటరిగా ఉంటే పిచ్చిదానివి అయిపోతావు. నీ కొడుకు కోసమైనా నీవు అన్ని మరిచిపోయి బతికి ఉండాలి. మామూలు మనిషివి కావాలంటూ నాన్న వెన్నుతట్టారు. గుండె ధైర్యం నింపారు. మళ్లీ చదువు బాట పట్టించారు. 2003లో గురజాడ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, శ్రీకాకుళంలో బీఎడ్‌ జాయిన్‌ చేశారు. ఇక ప్రతిరోజు తెల్లవారు జామున నాలుగంటలకు నిద్ర లేచి బస్సులో గాజువాక నుంచి శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామం వెళ్లడం.. రావడం. ఇంటికి రాగానే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న కొడుకు. ఓ వైపు పిల్లాడికి చదువు చెప్పుకుంటూ నేను చదువుకుంటూ బీఎడ్‌ డిస్టింక్షన్‌లో పాసయ్యాను.

Read latest Krishna News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top