ఆసిఫాబాద్‌అర్బన్: ఎల్‌నినో ప్రభావంతో వలసలు నివారించేందుకు వీబీజీ రాంజీ పథకం ద్వారా కూలీలకు 125 రోజుల పనిదినాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటి పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వీబీజీ రాంజీ పథకం ద్వారా పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, జలసిరి పథకం కింద ఊట కుంటలు, ఇంకుడు గుంతలు, పశువులకు తాగునీటి వనరులను కల్పించాలన్నారు. చేయూత పింఛన్ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలని, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పనులు గ్రౌండింగ్ చేయాలని ఆదేశించారు. పీఎం ఆవాస్ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.హరిత మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల అమలు, పాఠశాలల్లో వసతుల కల్ప న, వీబీజీ రాంజీ పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ హర్ష్ చౌదరి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఓటు నమోదుకు మరో అవకాశం
ఆసిఫాబాద్‌అర్బన్: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆబ్సెంట్, వలస, మరణం, డూప్లికేట్ జాబితాలో గుర్తించిన ఓటర్లకు మరోసారి ఓటు నమోదుకు ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత తెలిపారు. జిల్లాలోని ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, సూజర్‌వైజర్లు, బూత్ అధికారులు సమన్వయంతో ఓటు నమోదు చేపట్టాలని ఆదేశించారు. ఏఎస్‌డీడీ జాబితాలోని అర్హులైన ఓటర్లను అప్రమత్తం చేసి, అవగాహన కల్పించాలన్నారు. అర్హులు నిర్ణీత విధానంలో ఫారం నింపి బూత్‌స్థాయి అధికారులకు అందించాలని సూచించారు.


