దండేపల్లి: మండలంలోని గుడిరేవు గోదావరినది ఒడ్డున గల ఆదివాసీల ఆరాధ్యదైవం శ్రీపద్మల్పురి కాకో ఆలయంలో దండారీ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు పలు జిల్లాలు, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ముందుగా గోదారమ్మకు శాంతి పూజలు చేశారు. అనంతరం కాకోను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అక్కడే వంటకాలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. దప్పుల దరువు, గుస్సాడీల నృత్యాలు, గిరిజన మహిళల సంప్రదాయ, కోలాట నృత్యాలు పలువురిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జుపటేల్, మాజీ ఎంపీ బాపురావు, మంచిర్యాల డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ పలువురు ప్రముఖులు కాకోను దర్శించుకున్నారు. భక్తుల కోసం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు అన్నదానం చేశారు.


