చేప పిల్లల పంపిణీలో స్పష్టత కరువు ఇప్పటికే నాలుగు నెలలు ఆలస్యం వెలవెలబోతున్న చెరువులు జిల్లాలో 81 మత్స్య సహకార సంఘాలు..
వాంకిడి: ఎల్నినోతో జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో అనేక రంగాలు దెబ్బతింటున్నాయి. లోటు వర్షపాతంతో చెరువులు, రిజర్వాయర్లు నిండకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం చేప పిల్లల పెంపకంపైనా పడింది. చెరువులు, కుంటలు నిండకపోవడం.. తాగు, సాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతాయనే అంచనాల నేపథ్యంలో చేప పిల్లల పంపిణీని ఇప్పటికీ ప్రాంరంభించలేదు. జూలై, ఆగస్టులోనే చేప వి త్తనం అందించాల్సి ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో అసలు పంపిణీ ఉంటుందా.. లేదా.. అనే దానిపై స్పష్టత కరువైంది. ఈ నేపథ్యంలో చేపపిల్లలకు బదులుగా నగదు చెల్లిస్తే కొంత ఉపయోగకరంగా ఉంటుందని మత్స్య సహకార సంఘాల సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 276 జలాశయాలు
జిల్లాలో మొత్తం 276 జలాశయాలు ఉండగా.. అందులో చిన్న చెరువులు(ఆరు నెలలు సరిపడా నీటి నిల్వ ఉండే చెరువులు) 261, పెద్ద చెరువులు 11, రిజర్వాయర్లు 4(కుమురంభీం, వట్టివాగు, ఎన్టీఆర్, పీపీరావు ప్రాజెక్టులు) ఉన్నాయి. రిజర్వాయర్లతో పాటు కొన్ని పెద్ద చెరువుల నుంచి సాగు నీటిని విడుదల చేయడంతోపాటు చేపలు పెంచుతుంటారు. గతేడాది 1.44 కోట్ల చేప పిల్లల పెంపకం లక్ష్యంగా పెట్టుకోగా.. 135 చెరువుల్లో 1.9 కోట్ల చేప విత్తనాలు పంపిణీ చేశారు. చిన్న చెరువుల్లో 35– 40 మి.మీ.ల సైజు పిల్లలు, పెద్ద చెరువులు, రిజర్వాయర్లలో 80– 100 మి.మీ.ల సైజు పిల్లలను విడుదల చేశారు. ఈ ఏడాది సైతం అదే లక్ష్యంతో అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు అధికారులు, ప్రభుత్వాన్ని సందిగ్ధంలోకి నెట్టేశాయి. ఇరిగేషన్ అధికారుల సూచనల ప్రకారం నీరు నిలకడగా ఉన్న పెద్ద చెరువులు 11, నాలుగు రిజర్వాయర్లలో దాదాపు 78 లక్షల సీడ్ వదిలే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
చిన్నచెరువులు ఎండిపోయే ప్రమాదం
జిల్లాలోని 81 మత్స్య సహకార సంఘాల్లో 3400 మందికి పైగా సభ్యులు ఉన్నారు. చేపలు పట్టడమే జీవనాధారంగా బతుకు సాగిస్తున్నారు. ఎల్నినో ప్రభావంతో వీరి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. వర్షాలు లేక చేప విత్తనాలు ఇప్పటివరకు పంపిణీకి నోచుకోలేదు. మరికొన్ని నెలల్లోనే చిన్న చెరువులు ఎండిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు విత్తన పంపిణీ చేస్తే ఎంత వరకు ఎదుగుదల ఉంటుందోనని అధికారులు యోచిస్తున్నారు. ఎండలు పెరిగితే చెరువులు నీరు అడుగంటి మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతారు.
నగదు బదిలీ చేస్తే..
ఎండలతో చేపల ఎదుగుదల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నందున మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. ఈ నెలలో విత్తనాలు పంపిణీ చేసినా అవి ఎదగాలంటే కనీసం 6 నుంచి 8 నెలల సమయం పడుతుంది. వేసవి నాటికే చెరువులు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. చేప పిల్లల పంపిణీకి బదులు కార్మికులకు నగదు బదిలీ చేస్తే కొంత మేలు జరుగుతుందని కొందరు మత్స్య సహకార సంఘాల సభ్యులు అభిప్రాయపడుతున్నారు. అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అండగా నిలవాలని కోరుతున్నారు.


