ఆసిఫాబాద్‌అర్బన్: కరువు జిల్లాగా ప్రకటించి ప్రజలను ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు, జిల్లా ఇన్‌చార్జి భూపాల్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కేవలం ఐదు కరువు మండలాలను ప్రకటించారని, మిగిలి న పది మండలాలను సైతం కరువు ప్రాంతాలుగా ప్రకటించాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యాపారులు కృత్రిమ బియ్యం కొరత సృష్టించి లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీఎం కార్మికులతోపాటు సంఘటిత, అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. రానున్న రోజుల్లో సీపీఎం ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రాజన్న, కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్, నాయకులు శ్రీనివాస్, రాజేందర్, టీకానంద్, కార్తీక్ పాల్గొన్నారు.


