రెబ్బెన: ప్రతినెలా మెడికల్ బోర్డు నిర్వహించి, వైద్య పరీక్షల్లో అనర్హులుగా నిర్ధారించిన కార్మికులకు తగిన ఉద్యోగాలు ఇవ్వాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ సెంట్రల్ కమిటీ పిలుపు మేరకు బుధవారం గోలేటి టౌన్‌షిప్‌లోని జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన పత్రాన్ని జీఎం శ్రీ రమేశ్‌కు అందించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణిలో మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, డిపెండెంట్ అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అర్హులైన కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని కోరారు. భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్మికులకు బూట్లు, హెల్మెట్లు, బిట్లు, డ్రిల్ రాడ్లు, ఎస్‌డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాలు, స్పేర్ పార్ట్స్, టైర్లు తదితర పరికరాలను తక్షణమే సరఫరా చేయాలన్నారు. టీజీ టీజీ జెన్‌కో, టీజీ ట్రాన్స్‌కో సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ.59వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఇప్పించాలన్నారు. కార్యక్రమంలో బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి, ఆర్గనైజింగ్ కార్యదర్శులు జగ్గయ్య, రాజేశ్, చంద్రశేఖర్, షమీ, ఫిట్ కార్యదర్శి అశోక్, ఓదెలు, షిఫ్ట్ ఇన్‌చార్జీలు అంజయ్య, వసీం, నాయకులు గోపాల్, శ్రీనివాస్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


