ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో తాగునీటి సమస్యలు రానీయొద్దని, ఇందుకోసం అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఏ గ్రామంలో కూడా నీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ నెల 16 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. బోర్లు, సింగిల్ ఫేజ్ మోటర్లు, ఓవర్ హెడ్ ట్యాంకులు, గ్రిడ్ పైప్‌లైన్లకు మరమ్మతులు చేయాలన్నారు. సమావేశంలో డీపీవో భిక్షపతి, మిషన్ భగీరథ ఈఈలు రాకేశ్, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు అవగాహన ఉండాలి
ఆసిఫాబాద్‌అర్బన్: రాష్ట్ర ఆర్థిక శాఖ నూతనంగా ప్రవేశపెట్టిన ఈహెచ్‌ఆర్‌ఎంఎస్ ఈ– సాంక్షన్‌పై అన్ని శాఖల డీడీవోలకు అవగాహన ఉండాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ శాఖల డీడీవోలకు శిక్షణ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈహెచ్‌ఆర్‌ఎంఎస్ ఈ– సాంక్షన్ విభాగాల ద్వారా కాగితరహిత కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విభాగాల నిర్వహణపై అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 6న అందరికీ అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఖజానా శాఖ అధికారి హమీద్ షాఖాన్ తదితరులు పాల్గొన్నారు.


