ఆసిఫాబాద్అర్బన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల అభ్యున్నతి, విద్యాభివృద్ధి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం ప్రత్యేక అవసరాలు గల పిల్లల అభ్యున్నతి, హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాస్థాయి ప్రత్యేక కార్యక్రమానికి డీఈవో సచ్చిదానంద చారి, అధికారులతో కలిసి హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమాజంలో సముచిత స్థానం, గౌరవం కల్పించడంతోపాటు వారి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. పిల్లలపై వివక్ష చూపకుండా, ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలన్నారు.


