ఆన్‌డ్యూటీల పేరుతో విధులకు ఉపాధ్యాయుల డుమ్మా! తొమ్మిది నెలల్లో వేల సంఖ్యలో నమోదు అనుమానాస్పద ఓడీలపై సమగ్ర విచారణ వివరాల సమర్పణకు నేడు తుది గడువు
కెరమెరి: ‘ఆన్‌డ్యూటీ’(ఓడీ)లపై జిల్లా విద్యాశాఖ దృష్టి సారించింది. అదనపు కలెక్టర్ ఆదేశాలతో 2026 జనవరి నుంచి సెప్టెంబర్ 30 వరకు నమోదైన ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్) ఓడీ వివరాలపై విస్తృత స్థాయి విచారణ మొదలైంది. బోధన, బోధనేతర ఉద్యోగులు నమోదు చేసిన ఓడీల వెనుక నిజానిజాలు తేల్చేందుకు ప్రత్యేక ఫార్మాట్‌తో నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మండల స్థాయిలో ఉద్యోగులు బుధవారం సాయంత్రం వరకు ఓడీ వివరాలను ఎమ్మార్సీల్లో సమర్పించాల్సి ఉండగా, గురువారం మండల విద్యాధికారులు జిల్లా కేంద్రానికి హార్డ్ కాపీలను పంపించనున్నారు.
క్యూఆర్ కోడ్‌తో లొకేషన్..
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 720, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు 15 ఉండగా, ఆసిఫాబాద్‌లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆయా స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 2,865 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో కాగితాల మీద రాసిచ్చిన అనుమతులతో తప్పించుకునేవారికి సాంకేతికత ఇప్పుడు చుక్కలు చూపిస్తోంది. ఎంఈవోలకు చేరిన పీడీఎఫ్ ఫైళ్లలో ప్రతిరోజూ నమోదు చేసిన ఓడీ పక్కనే క్యూఆర్ కోడ్ ముద్రించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే సదరు ఉద్యోగి ఆ సమయంలో ఏ ప్రాంతంలో(లొకేషన్) ఉన్నారనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తోంది. అధికారిక పని మీద జిల్లా కేంద్రం, ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లారా? లేక సొంత పనుల్లో ఉంటూ ఓడీ కొట్టారా అన్నది స్పష్టమవుతుంది. నివేదికలో ఉద్యోగితోపాటు కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఎంఈవో సంతకం, అధికారిక స్టాంపు తప్పనిసరి చేయడంతో అధికారులు కూడా సంబంధిత రికార్డులను నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఉపాధ్యాయుల్లో భిన్నస్వరం..
అయితే ఈ తనిఖీలపై ఉపాధ్యాయులు భిన్నంగా స్పందిస్తున్నారు. శాఖపరమైన శిక్షణలు, క్రీడాపోటీలు, కాంప్లెక్స్ సమావేశాలు, ఎన్నికల సంబంధిత విధులు, అధికారిక డాక్యుమెంట్ల సమర్పణ కోసం పై అధికారుల ఆదేశాలతో బడులు వదిలి వెళ్లామని కొందరు చెబుతున్నారు. అధికారులు స్వయంగా పంపించి ఇప్పుడు ఆధారాలు అందించాలంటే ఎలా అని క్షేత్రస్థాయిలో బాధ్యతలు నిర్వహించిన ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. పాత కాగితాలు, అనుమతి పత్రాలు ఫైల్ చేయడం తమకు పరీక్షలా మారిందని వాపోతున్నారు. మరోవైపు ఎలాంటి రాతపూర్వక అనుమతులు లేకుండా, కేవలం మౌఖిక అనుమతుల పేరుతో వ్యక్తిగతంగా వెళ్లిన కొందరు ఉద్యోగుల్లో మాత్రం వణుకు మొదలైంది. సర్వీస్‌కు ఎక్కడ మచ్చ వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. హెచ్‌ఎంలు, ఎంఈవోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ.. రికార్డులను సర్దుబాటు చేసే పనిలో కొందరు తలమునకలైనట్లు సమాచారం.
2,518 పెండింగ్..
జిల్లాలో 15 మండలాలు ఉండగా, ప్రతీ ఎమ్మార్సీ పరిధిలో వేల సంఖ్యలో ఆన్‌డ్యూటీలు నమోదయ్యాయి. కాగజ్‌నగర్ మండలంలో అత్యధికంగా 10,032 ఓడీలు నమోదు కాగా, లింగాపూర్‌లో అత్యల్పంగా 1,737 నమోదయ్యాయి. ఎఫ్‌ఆర్‌ఎస్ పోర్టల్ ప్రకా రం జిల్లావ్యాప్తంగా ఏకంగా 2,158 ఓడీ ఎంట్రీలు ఆమోదం లేదా తిరస్కరణకు నోచుకో కుండా ఓడీ అప్రూవ్/నాట్ అప్రూవ్ విభాగంలో నిలిచిపోయాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు ఉండవచ్చని భావిస్తున్నారు. ఉపాధ్యాయులు నిజంగానే ఎన్నికల విధులు, స్పాట్ వాల్యూయేషన్, సమావేశాలు, శిక్షణ తదితర అధికారిక విధులకు హాజరైనప్పటికీ సంబంధిత ఎంఈవోలు లేదా కాంప్లెక్స్ హెచ్‌ఎంలు వాటిని సకాలంలో పరిశీలించి ఆమోదించకపోవడం.. లేదా ముందస్తు అనుమతులు కాని, ఎలాంటి అధికారిక ఉత్తర్వులు కాని లేకుండానే పోర్టల్‌లో సొంతంగా ‘ఓడీ’గా నమోదు చేసుకుని పాఠశాలలకు హాజరు కాకపోవడం అని తెలుస్తోంది. సంబంధిత ఉద్యోగి సంతకం, రిమార్కులతో కూడిన పీడీఎఫ్ ఫారాలను ఎమ్మార్సీల్లో భద్రపర్చనుండగా, నివేదికలను ఎక్సెల్ ఫార్మాట్‌లో డీఈవో కార్యాలయానికి అందించనున్నారు.
మండలాల వారీగా వివరాలు
మండలం ఓడీలు
కాగజ్‌నగర్ 10,032
ఆసిఫాబాద్ 8,141
రెబ్బెన 6,125
వాంకిడి 6,035
కెరమెరి 6,015
సిర్పూర్(టి) 5,291
చింతలమానెపల్లి 5,036
కౌటాల 4,788
దహెగాం 3,968
బెజ్జూర్ 3,717
జైనూర్ 2,915
తిర్యాణి 2,902
సిర్పూర్(యు) 2,005
పెంచికల్‌పేట్ 1,839
లింగాపూర్ 1,737


