ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభ భారీగా తరలివచ్చిన రైతులు, ప్రజలు అన్నదాత ల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్ సభ విజయవంతంతో గులాబీ శ్రేణుల్లో జోష్
ఆదిలాబాద్‌టౌన్/కై లాస్‌నగర్: రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన రైతుగర్జన సభ సక్సెస్ అయ్యింది. జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఆదివారం నిర్వహించిన ఈ సభ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణీత సమయం కంటే గంటన్నర ఆలస్యంగా వచ్చినప్పటికీ ప్రజలు ఓపిగ్గా ఎదురుచూశారు. రైతులు, యువకులు, మహిళలు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. జై తెలంగాణ.. జై బీఆర్‌ఎస్ నినాదాలతో మార్మోగింది. సాయంత్రం 6.40 గంటలకు సభాస్థలికి చేరుకున్న కేటీఆర్‌కు బీఆర్‌ఎస్ నాయకులు ఆదివాసీ సంప్రదాయ దండారీ నృత్యాలు, బాణసంచా నడుమ ఘన స్వాగతం పలికారు. వేదికపై పార్టీ ముఖ్య నేతలతో కలిసి కేటీఆర్ అభివాదం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేటీఆర్ ప్రసంగిస్తున్నంత సేపు పార్టీ శ్రేణులు గులాబీ జెండాలు, ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, హన్మంత్ శిండే, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, క్రాంతి కిరణ్, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్ రావు, జెడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి భుక్యా జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహం నింపిన కేటీఆర్ ప్రసంగం..
కేటీఆర్ ప్రసంగం పార్టీ శ్రేణులతో పాటు సభకు వచ్చిన వారిలో ఉత్సాహం నింపింది. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డి, ప్రధాని నరేంద్రమోదీ, ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దొంగచాటుగా చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ చెప్పే మోదీ ఆదిలాబాద్‌లో ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీ వారే ఉన్నప్పటికీ రైతాంగ సమస్యలపై ఏ ఒక్కరోజు నోరు మెదపలేదన్నారు. ఎన్నికల అనంతరం సీసీఐని తెరిపిస్తామని అమిత్‌షా ప్రకటించగా, తుక్కు కింద విక్రయిస్తున్నా వారు ఎందుకు మౌనం వీడటం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే శంకర్‌కు ఇండస్ట్రీయల్ కారిడార్, ఎయిర్‌పోర్టు కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై లేదన్నారు. కోర్టా–చనాఖా ప్రాజెక్ట్‌ను తాము పూర్తి చేస్తే కనీసం కాలువలు తవ్వే సోయి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. అంతకు ముందు కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదఘటనలో మృతి చెందిన ఐదుగురు పసికందుల కుటుంబ సభ్యులకు రూ.లక్ష చొప్పున ఆర్థికసాయం అందజేశారు.
అన్నం పెట్టే రైతన్నకు అడుక్కునే పరిస్థితి వచ్చింది
కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాట వినకుండా కాంగ్రెస్‌కు ఓటు వేసినందుకు దేశానికి అన్నం పెట్టే రైతన్న చెయ్యి పట్టి అడుక్కునే పరిస్థితి ఏర్పడింది. వారం రోజుల్లో బోథ్ నియోజకవర్గంలో నలుగురు అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైతు బంధు, రుణమాఫీ ఇవ్వని ప్రభుత్వ అసమర్థత, చేసిన అప్పులు తీర్చే అవకాశం లేకనే రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఏడాది ఓపిక పడితే చాలు.. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. రైతులు అధైర్య పడకుండా ఉండాలి. ఆత్మహత్యలు చేసుకోవద్దు. కాంగ్రెస్‌ను తరిమే రోజులు దగ్గర పడ్డాయ్.
– అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే


