కెరమెరి: విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరుపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది. కొన్నేళ్లుగా ఆన్‌లైన్ హాజరు నమోదు ఆశాజనకంగా ఉంటున్నా.. వాస్తవ పరిస్థితుల్లో వ్యత్యాసాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సమగ్ర శిక్ష విభాగం సరికొత్త కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందులో భాగంగా నవంబర్ నెలను ‘ప్రత్యేక హాజరు మాసోత్సవం– 100 శాతం అటెండెన్స్ డ్రైవ్’గా ప్రకటిస్తూ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరు వరకు సాగే ఈ డ్రైవ్ ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చే అవకాశం ఉంది.
జవాబుదారీతనం తప్పనిసరి
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 720, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు 15, ఆసిఫాబాద్‌లో అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఆయా స్కూళ్లలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది 2,135 మంది ఉండగా, విద్యార్థులు 41,218 మంది చదువుకుంటున్నారు. పాఠశాలల్లో హాజరులో జవాబుదారీతనాన్ని తప్పనిసరి చేశారు. గతంలో కాగితాలకే పరిమితమైన ఫేషియల్ రికగ్నేషన్ సిస్టం(ఎఫ్‌ఆర్‌ఎస్)ను తప్పనిసరి చేశారు. రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది ముఖ గుర్తింపు హాజరు నమోదు చేయాల్సిందేనని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ‘జీరో నాట్ క్యాప్చర్ విధానం అమలు చేస్తుంది.. ఏ పాఠశాలల్లో కూడా హాజరు నమోదు కాలేదు’ అనే కేటగిరీలు కనిపించడానికి వీలుండదు. ‘నెట్‌వర్క్ లేదు. పరికరం పనిచేయలేదు...’ వంటి సాంకేతిక కారణాలకు సమయ పరిమితి విధించారు. డివైస్, నెట్‌వర్క్, ఎన్‌రోల్‌మెంట్ సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలని ఆదేశించారు. అలాగే అధికారిక పనులపై వెళ్లే ఉపాధ్యాయుల ఆన్‌డ్యూటీ(ఓడీ) వివరాలను 24 గంటల వ్యవధిలోనే నమోదు చేయాలి.
నిరంతరం పర్యవేక్షణ
ఉపాధ్యాయులు సక్రమంగా పాఠాలు చెప్పినా.. విద్యార్థులు బడికి వస్తేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇందుకు పనిదినాల్లో వందశాతం వాస్తవ హాజరు సాధించడమే లక్ష్యంగా వారం వారం ప్రగతి సాధించాలి. నవంబర్‌లో ప్రత్యేక డ్రైవ్ నేపథ్యంలో జిల్లా, మండలస్థాయి అధికారులు నిరంతరం హాజరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేపడతారు. జిల్లా విద్యాధికారితోపాటు ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. సమీక్షలు నిర్వహించి ఏ పాఠశాలల్లో తక్కువ హాజరు ఉంటే అక్కడ తక్షణ దిద్దుబాటు చర్యలు చేపడతారు.
నిర్లక్ష్యం చేయొద్దు
ఈ నెలాఖరు వరకు హాజ రుపై ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుంది. ఎంఈవోలు, క్లస్ట ర్ ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యం చేయకుండా ప్రతి రోజూ పర్యవేక్షించాలి. అటెండెన్స్‌పై ప్రతీవారం సమీక్షలు చేపట్టాలి. వందశాతం హాజరు లక్ష్యం సాధించేందుకు ఉపాధ్యాయులు సహకరించాలి.
– సచ్చిదానందచారి, డీఈవో
ఉపాధ్యాయుల ‘హోం విజిట్’
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుటుంబ, వ్యవసాయ పనులతోపాటు నిర్లక్ష్యంతోనూ విద్యార్థులు పాఠశాలలకు దూరమవుతున్నారు. ఇక నుంచి వరుసగా ఐదు రోజులు, అంతకంటే ఎక్కువ కాలం పిల్లలకు బడికి దూరమైతే వారి జాబితా రూపొందించాలి. కేవలం తల్లిదండ్రులకు ఫోన్ చేసి వదిలేయకుండా ఉపాధ్యాయులు విద్యార్థులకు ఇళ్లను సందర్శించాలి. గైర్హాజరుకు కారణాలను తెలుసుకోవాలి. చదువు ప్రాధాన్యతను వివరించి, పిల్లలకు బడిబాట పట్టేలా అవగాహన కల్పించాలి. జిల్లాలోని అనేక గ్రామాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. గుస్సాడీ దండారీ ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు పాఠశాలకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వందశాతం హాజరు సాధించడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా మారనుంది.


