నేడు అత్యున్నత స్థాయి సమావేశం ముంబైలో మహారాష్ట్ర, తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీ ‘ఎత్తు’పై సర్వత్రా ఆసక్తి ప్రాజెక్టు నిర్మిస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మేలు
చింతలమానెపల్లి: ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కల ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణంపై ఉత్కంఠ కొనసాగుతోంది. కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద 152 ఎత్తుతో బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాల అత్యున్నతస్థాయి సమావేశం సోమవారం ముంబైలో జరగనుంది. ఎత్తు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే ప్రాజెక్టు నిర్మాణంలో ముందడుగు పడే అవకాశం ఉంది. దీంతో స్థానిక ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రూ.38,500 కోట్ల వ్యయంతో 16.4 లక్షల ఎకరాలకు సాగునీరందించే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు పనులకు 2008 డిసెంబర్ 8న శ్రీకారం చుట్టారు. కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, దహెగాం మండలాల్లో కాలువ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ.1.37 లక్షల చొప్పున పరిహారం సైతం చెల్లించారు. అప్పటి ప్రభుత్వం 2010 బడ్జెట్‌లో తొలివిడతగా రూ.200 కోట్ల నిధులను మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కేటాయించింది. 2011 బడ్జెట్‌లో మరో రూ.1000 కోట్లు కేటాయించారు. 15 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా.. సుమారు ఆరు కిలోమీటర్ల వరకు పూర్తయ్యాయి. తుమ్మిడిహె ట్టి వద్ద నిర్వహించే రిజర్వాయర్‌ను నాలుగో ప్యాకేజీగా కేటాయించారు. అయితే వైఎస్ మరణం, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత వివిధ కారణాలతో ప్రాజెక్టు నిలిచిపోయింది.
ఎత్తుపై పొత్తు కుదిరేనా..?
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర మంత్రులతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రాణహిత నదిపై నిర్మించే ప్రాజెక్టు ఎత్తుపై ప్రధానంగా చర్చించనున్నారు. మహారాష్ట్రలో సుమారుగా 2500 హెక్టార్లు ముంపునకు గురవుతుండగా భూసేకరణ, పరిహారం చెల్లింపు అంశాలపై చర్చలు జరగనున్నాయి. గతంలో 148 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించగా.. నీటి లభ్యత కోసం 152మీటర్ల ఎత్తుకు పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రకు ప్రతిపాదించనుంది. సంబంధిత నివేదికలను వారికి అందించనున్నారు.
ముంపు విషయంలోనే అభ్యంతరాలు
ప్రాజెక్టు పాత ప్రతిపాదన ప్రకారం మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్ జిల్లాలోని కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతుండగా అప్పటి రాజూరా ఎమ్మెల్యే సుభాష్ ధోటే, అహేరి ఎమ్మె ల్యే దీపక్ 1ఆత్రం సైతం నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రాణ హిత నీటిని వినియోగించుకునేందుకు మహా రాష్ట్రకు అనుకూలత లేదని ఇంజినీరింగ్ అధికా రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు ముంపు ప్రాంతం విషయంలో మినహా ఇతర అభ్యంతరాలు లేవని స్పష్టమైంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మంత్రుల బృందం పలుమార్లు చర్చలు జరపగా.. 148 మీటర్ల ఎత్తుకు నిర్మించేలా రెండు ప్రభుత్వాల మధ్య సఖ్యత కుదిరింది. ఆ తర్వాత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు మొగ్గు చూపింది.


