నాలుగో రైల్వే లైన్‌పై సర్వే | - | Sakshi
Sakshi News home page

నాలుగో రైల్వే లైన్‌పై సర్వే

Sep 9 2026 11:28 PM | Updated on Sep 9 2026 11:28 PM

● బల్లార్షా–కాజీపేట మార్గంలో సాధ్యాసాధ్యాలపై అధికారుల తనిఖీ ● గణనీయంగా తగ్గనున్న ప్రయాణ సమయం

బెల్లంపల్లి: ప్రయాణికుల సౌలభ్యం, సరుకుల రవాణా రద్దీని అధిగమించడానికి బల్లార్షా–కాజీపేట మార్గంలో నాలుగో రైల్వే లైన్‌ నిర్మాణానికి రైల్వే శాఖ తుది దశ సర్వే, తనిఖీకి సిద్ధమైంది. గురు, శుక్రవారాల్లో దక్షిణ మధ్య రైల్వే జోన్‌, సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు ఉమ్మడిగా తనిఖీ చేపట్టనున్నారు. నాలుగో లైన్‌ నిర్మాణం సాధ్యాసాధ్యాలపై రైల్వే ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు. ఈ నెల 15లోగా సర్వే, తనిఖీ నివేదిక సమర్పించాలని రైల్వే అధికారులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

బొగ్గు, సరుకుల రవాణా

దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో నిత్యం బొగ్గు, సరుకుల రవాణా జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో రైళ్ల రద్దీ కారణంగా సరిపడా లైన్లు లేక గూడ్స్‌ రైళ్లు నెమ్మదిగా ప్రయాణం సాగించాల్సి వస్తోంది. అనివార్యంగా వేగాన్ని నియంత్రించాల్సిన ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. దీని నివారణ కోసం రైల్వేశాఖ నాలుగో లైన్‌ సర్వే, తనిఖీకి సిద్ధపడింది. బొగ్గు, సరుకుల రవాణాతోపాటు అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల రైళ్లను మరిన్ని ప్రవేశ పెట్టడానికి నాలుగో లైన్‌ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎగువ, దిగువ మార్గాల్లో ఒకేసారి సమాంతరంగా రెండు రైళ్ల చొప్పున నడిచే అవకాశాలు ఉన్నట్లు సూత్రప్రాయంగా అంచనా వేశారు.

మూడో లైన్‌పై రైళ్ల పరుగులు

కాజీపేట నుంచి బల్లార్షా మధ్య 235 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాష్ట్రంలోని హనుమకొండ, కరీంనగర్‌, పెద్దపల్లి, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్‌, మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాల మీదుగా నాలుగో రైల్వే మార్గం వెళ్తుంది. ఢిల్లీ–చెన్నయ్‌ గ్రాండ్‌ ట్రంక్‌ రైల్వేలో ఈ మార్గం భాగంగా కాగా ఇటీవలే రెండు నెలల క్రితం కాజీపేట–బల్లార్షా మార్గంలో నిర్మించిన మూడో మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి అంతరాయం లేకుండా మూడో మార్గంలో రైల్వే పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో బొగ్గు, సరుకు రవాణా రైళ్ల రద్దీ అధికంగా ఉంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాలైన మందమర్రి, రవీంద్రఖని, బెల్లంపల్లి, రామగుండం నుంచి బొ గ్గు రవాణా రైళ్లు ఎక్కువగా నడుస్తున్నాయి. మహా రాష్ట్రలోని పర్భనీ, కర్ణాటకలో యాదగిరి దగ్గరకి రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. మూడో మార్గం మొత్తం పూర్తిగా ఒకే మార్గం(దిగువ మార్గంలో)లో లేదు, కొన్ని చోట్ల ఎగువ మార్గంలో, మరికొన్ని చోట్ల దిగువ మార్గంలో ఉండడం గమనార్హం.

నాలుగో లైన్‌ నిర్మాణంతో..

ప్రస్తుతం సర్వే, తనిఖీ కోసం ప్రతిపాదించిన నాలుగో లైన్‌ నిర్మాణం పూర్తయితే బహుళ ప్రయోజనాలు కలుగనున్నాయి. అప్‌, డౌన్‌ మార్గాల్లో ఒకే పర్యాయం రెండు రైళ్లు చొప్పున ఏమాత్రం అవాంతరాలు లేకుండా, సిగ్నల్‌ సమస్య ఏర్పడకుండా పట్టాలపై పరుగులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. రైళ్ల రాకపోకలకు సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. సరుకు రవాణా రైళ్ల వేగం కూడా పెరగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement