ఆసిఫాబాద్: వానాకాలం సీజన్ వరిధాన్యం కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, ఇతర అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం నిల్వలకు అవసరమైన గోదాములు సిద్ధంగా ఉండాలన్నారు. సంబంధిత ఏజెన్సీలతో ముందస్తు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ, ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకుని అక్టోబర్ 1 నాటికి కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. గత సీజన్‌కు సంబంధించిన వరిధాన్యం, గన్నీ సంచుల లెక్కలు సరిచూడాలన్నారు. వానాకాలం సీజన్‌లో ధాన్యం కొనుగోళ్లు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఘనంగా కాళోజీ జయంతి
ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కాళోజీ నారాయణ రావు 112వ జయంతి, తెలుగు భాషా దినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కె.హరిత అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కామ్టే అనిల్‌కుమార్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి నోడల్ అధికారి భాస్కర్, ఏఎంసీ చైర్మన్ ఇరుకుల్ల మంగతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాళోజీ సేవలను కలెక్టర్ కొనియాడారు. ప్రజల్లో సామాజిక చైతన్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణపతుల విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారయ్యే విగ్రహాలకు బదులుగా పర్యావరణ హితమైన మట్టి గణపతులను ప్రతిష్టించాలన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమ అధికారి అహ్మద్, బాలల సంరక్షణ అధికారి మహేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


