కాగజ్‌నగర్‌టౌన్: అటవీ సంపద, వన్యప్రాణులు, సహజ పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో రక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తున్నట్లు ఎఫ్‌డీవో భార్గవ్‌కుమార్ తెలిపారు. కాగజ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్ కార్యాలయంలో బుధవారం డివిజన్ పరిధిలోని అటవీ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎఫ్‌డీవో మాట్లాడుతూ అటవీ భూముల ఆక్రమణ, వన్యప్రాణుల వేట, చెట్ల నరికివేత, ఇతర అక్రమ కార్యకలాపాలను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అడవుల్లో పెట్రోలింగ్, రక్షణ, గస్తీ, వాహనాల తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని, అనుమానస్పద కార్యకలాపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కెమెరా ట్రాప్స్, మొబైల్ పెట్రోలింగ్, సాంకేతిక పర్యవేక్షణ వంటి ఆధునిక పద్ధతులను వినియోగించాలని సూచించారు. నీటి వనరులను పర్యవేక్షించాలని, వన్యప్రాణుల కదలికల పరిశీలనకు డ్రోన్లను వినియోగించాలని సూచించారు. సమావేశంలో కాగజ్‌నగర్, సిర్పూర్(టి), కర్జెల్లి, బెజ్జూర్, పెంచికల్‌పేట్ రేంజ్‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


