పీహెచ్‌సీల్లో మల్టీపారామెట్రిక్‌ డయాగ్నోస్టిక్‌ సిస్టం | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీల్లో మల్టీపారామెట్రిక్‌ డయాగ్నోస్టిక్‌ సిస్టం

Sep 8 2026 11:53 PM | Updated on Sep 8 2026 11:53 PM

● కలెక్టర్‌ కె.హరిత

ఆసిఫాబాద్‌: జిల్లాలోని పీహెచ్‌సీల్లో మల్టీ పారామెట్రిక్‌ డయాగ్నోస్టిక్‌ సిస్టం ద్వారా 75 రకాల వైద్య పరీక్షలు నిర్వహించన్నుట్లు కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మంగళవారం హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌, ఏవియానిక్స్‌ డివిజన్‌ హైదరాబాద్‌, ఓమిని యాక్టివ్‌ ఫౌండేషన్‌ సహకారంతో సీఎస్‌ఆర్‌ కార్యక్రమం కింద సమకూర్చిన మల్టీ పారామెట్రిక్‌ డయాగ్నోస్టిక్‌ సిస్టంను అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, ఓమిని యాక్టివ్‌ ఫౌండేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ భాటియాతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అధునాతన వైద్య పరికరాలతో పీహెచ్‌సీల్లోనే రోగుల వైటల్స్‌ మానిటరింగ్‌, రక్త పరీక్షలు నిర్వహిచి, ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ఈ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. డీఎంహెచ్‌వో నాగేంద్ర, ఆకాంక్షిత జిల్లా సమన్వయ కర్త బాలరాజు పాల్గొన్నారు.

ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి

ఆసిఫాబాద్‌: జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ కె.హరిత తెలిపారు. కలెక్టరేట్‌లో 2025– 26 షెడ్యూల్డ్‌ కులాల అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద ఆర్థిక పురోగతిపై మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశానికి అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌తో కలిసి హాజరయ్యారు. స్వయం ఉపాధి పథకం కింద మంజూరైన యూనిట్లను అర్హులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో ఎస్సీ సహకార సంస్థ కార్యనిర్వాహక సంచాలకుడు సురేశ్‌కుమార్‌, ఎస్సీ అభివృద్ధి అధికారి ఎం.అశోక్‌, లీడ్‌ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ జనార్దన్‌, ఎంవీఐ మసూద్‌ అలీ పాల్గొన్నారు.

వినాయక మండపాలకు పటిష్ట భద్రత

ఆసిఫాబాద్‌: వినాయక మండపాలు, నిమజ్జన కార్యక్రమాలకు పటిష్ట భద్రత కల్పించాలని కలెక్టర్‌ కె.హరిత ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఏర్పాట్లపై ఎస్పీ నితిక పంత్‌, అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌, ఎం.డేవిడ్‌, కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్‌ జోస్తిన్‌ జోల్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని, ట్రాఫిక్‌ నియంత్రణ, తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం, అగ్నిమాపక, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలన్నారు. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీల పరిధిలో నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు అశోక్‌, వహీదుద్దీన్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఉత్తమ్‌ జాడె, మున్సిపల్‌ కమిషనర్లు అంజయ్య, తిరుపతి, తహసీల్దార్లు మధుకర్‌, రియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement