ఆసిఫాబాద్‌అర్బన్/కాగజ్‌నగర్‌టౌన్: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో నిమజ్జన ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తప్పనిసరిగా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎస్పీ నితిక పంత్ ఆదేశించారు. ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ సన్నద్ధమవుతుందని తెలిపారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని పెద్దవాగు ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలైన అంబేడ్కర్ చౌరస్తా, పొట్టి శ్రీరాములు చౌరస్తా తదితర ప్రాంతాలను తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ వినాయక విగ్రహాలను తీసుకెళ్లే రూట్లలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలన్నారు. బారికేడింగ్, రోప్ బ్యారియర్స్, తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. విగ్రహాలతో వచ్చే వాహనాల కోసం ప్రత్యేక రూట్ మ్యాప్ రూపొందించి ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలను గుర్తించాలన్నారు. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై నిరంతర పోలీసు పర్యవేక్షణ ఉండాలని సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో సీసీటీవీ, డ్రోన్ నిఘా, పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా పరిస్థితులను పర్యవేక్షించాలన్నారు. వైద్య, అగ్నిమాపక, రక్షణ బృందాల సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మహిళలు, పిల్ల లు, వృద్ధుల భద్రతపై శ్రద్ధ వహించాలని, తప్పిపోయిన వారికి సాయం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. డీఎస్పీ వహీదుద్దీన్, కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుమారస్వామి, టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సైలు పాల్గొన్నారు.


