కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు ఆక్రమించడం, ఇష్టారాజ్యంగా ఆటోలు, ద్విచక్రవాహనాలను నిలపడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ ఆస్పత్రి వరకు రోడ్డును ఆక్రమించుకుని దుకాణాల ఎదుట రోడ్డుపైనే సరుకులు పెట్టడం, తోపుడు బండ్లతో రోడ్డును ఆక్రమించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయమేర్పడింది. అంబేడ్కర్ చౌరస్తాలో ఆటోలు ఎక్కడపడితే అక్కడ నిలుపుతుండడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. రానున్న వినాయక చవితి, దసరా పండుగల నేపథ్యంలో జనం రద్దీ మరింత పెరిగి పరిస్థితి దారుణంగా మారే అవకాశముంది. ఇప్పటికై నా మున్సిపల్, పోలీస్ అధికారులు స్పందించి రోడ్డు ఆక్రమణలను తొలగించి, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


