కెరమెరి: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు ‘ఏక్ పేడ్ మా కే నామ్ 3.0’ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థి మొక్కలు నాటేలా ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ‘ఎకో క్లబ్ మిషన్ లైఫ్’ పేరిట ప్రత్యేక క్లబ్‌లను ఏర్పాటు చేసింది. దీని ద్వారా అన్ని పాఠశాలల్లో తల్లి పేరిట ఒక మొక్క నాటేలా ఆదేశాలు జారీ చేసింది. మొక్కలను నాటి పర్యవరణాన్ని కాపాడాలని పిలుపునిస్తోంది. మొక్క నాటి ఫొటో తీసి ‘మిషన్ లైఫ్’ పోర్టల్ అప్‌లోడ్ చేసినవారికి ఆన్‌లైన్‌లోనే ప్రశంసాపత్రం అందిస్తోంది.
పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు
ప్రస్తుతం చెట్లను విరివిగా నరికి వేస్తుండడంతో కాలుష్య ప్రభావం పెరుగుతోంది. దీంతో వాతావరణంలో సమతుల్యత తగ్గుతోంది. ఈ ప్రభావం భవిష్యత్ తరాలపై తీవ్రంగా చూపే అవకాశముంది. వృక్షాలు అనేక చోట్ల నేలకొరగడంతో వానలు తగ్గి, ఎండలు పెరుగుతున్నాయి. నాటడమే తమవంతు అనుకుంటున్న అధికారులు ఆ తర్వాత మొక్కల సంరక్షణను విస్మరిస్తున్నారు. దీంతో అవి ఎండిపోతున్నాయి. పరిస్థితిలో మార్పు రాకుంటే రానున్న రోజుల్లో గాలిని కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడనుందని పర్యావరణ వేత్తలు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించగా అదే కార్యక్రమాన్ని ప్రస్తుత ప్రభుత్వం వనమహోత్సం పేరిట నిర్వహిస్తోంది. గతంలో ప్రభుత్వం జిల్లాలోని పాఠశాలలతోపాటు ఖాళీ స్థలాలు, గ్రామపంచాయతీ, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారుల వెంట మొక్కలు నాటడంతో కొంతవరకు అటవీ విస్తీర్ణం పెరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని ప్రధాని మోదీ సూచించడంతో రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పాఠశాలల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు నడుం బిగించారు. తల్లులు తమ పిల్లలను ఎంత ప్రేమగా కాపాడుకుంటారో.. అదే రీతిన నాటిన మొక్కను సంరక్షిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ప్రతీ విద్యార్థి పాఠశాల ఆవరణలో తప్పనిసరిగా ఒక మొక్కను నాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
గత ఉత్సాహం కనిపించదేమి?
రెండేళ్లుగా వనమహోత్సవం కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా మొక్కలు నాటాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడం లేదు. రెండేళ్లుగా చూపిన ఉత్సాహం ఈసారి కనిపించడం లేదు. అవగాహన రాహిత్యమో? లేదా.. మనకెందుకులే.. అన్న నిర్లక్ష్యమో? తెలియదు గాని జిల్లాలోని అనేక పాఠశాలల్లో ఇంకా కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. ఇటీవల ప్రారంభమైన ఎస్‌వీహెచ్‌ఆర్ యాప్‌లో మొక్కలు నాటే కార్కక్రమాన్ని ప్రత్యేక అంశంగా పరిగణించారు. దీనికి 21 మార్కులు కేటాయించారు.


