ఆసిఫాబాద్‌అర్బన్: వసతులు లేక జిల్లాలో పలుచోట్ల వైకుంఠధామాలు నిరుపయోగమయ్యాయి. దీంతో దహనక్రియలు నిర్వహించేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో 335 గ్రామపంచాయతీలుండగా అన్నిచోట్ల గత ప్రభుత్వం వైకుంఠధామాలు నిర్మించింది. రూ.12లక్షలతో ఒక్కో వైకుంఠధామం నిర్మించినా ప్రస్తుతం చాలాచోట్ల కనీస సౌకర్యాలు లేక నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఊరికి దూరంగా వీటిని నిర్మించడంతో అవి వినియోగంలో లేకుండాపోయాయి. దీంతో ఒర్రెలు, వాగులు, వంతెనలు, రహదారులపైనే దహన క్రియలు నిర్వహించాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంలో సుమారు 40వేలకు పైగా జనాభా ఉండగా రెండు వైకుంఠధామాల అవసరముంది. పెద్దవాగు సమీపంలో నూతనంగా నిర్మించిన వైకుంఠధామానికి సరైన రహదారి సౌకర్యం లేదు. కనీస వసతులు కూడా కరువయ్యాయి. కనీస సదుపాయాలు కల్పించి దీన్ని అందుబాటులోకి తేవాలని జిల్లాకేంద్రం వాసులు కోరుతున్నారు.
వాగులు, ఒర్రెల్లోనే దహన సంస్కారాలు
జిల్లా కేంద్రంలో ఎవరైనా మరణిస్తే శ్మశాన ఘాట్‌కు చేరాలంటే ఇబ్బందులేర్పడుతున్నాయి. అక్కడి వరకు కనీసం రోడ్డు సౌకర్యం లేదు. ముఖ్యంగా రాత్రివేళ విద్యుత్ సౌకర్యం లేక చీకట్లోనే ఇబ్బందులు పడుతూ కార్యక్రమాన్ని ముగించుకోవాల్సి వస్తోందని జిల్లా కేంద్రం వాసులు వాపోతున్నారు. వర్షాకాలంలోనైతే మరీ దారుణం. జిల్లా కేంద్రంలో కనీసం రెండు వైకుంఠధామాలు నిర్మించాలని అనేకసార్లు ఆందోళనలు చేసినా, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకున్నా ఫలితం లేకుండాపోయిందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అన్ని సౌకర్యాలతో రెండు వైకుంఠధామాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన ఆసిఫాబాద్ మండలంలోని రాజంపేట గ్రామపంచాయతీ పరిధిలో వైకుంఠధామం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


