ఫలితాల్లో ‘ఆదర్శం’ | - | Sakshi
Sakshi News home page

ఫలితాల్లో ‘ఆదర్శం’

Sep 5 2026 1:50 AM | Updated on Sep 5 2026 1:50 AM

● విద్యాబోధనలో ప్రత్యేకత చాటుకుంటున్న ఉపాధ్యాయులు ● విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు

ఆసిఫాబాద్‌రూరల్‌: ఆసిఫాబాద్‌ తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు బోధన కొనసాగుతోంది. ఈ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌గా మహేశ్వర్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. ఏటా పది, ఇంటర్‌ ఫలితాల్లో పాఠశాలను జిల్లాలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నారు. హాజరు శాతం పెంచడంతోపాటు క్రమశిక్షణతో కూడిన విద్య అందిస్తున్నారు. పాఠశాల అభివృద్ధికి పాటు పడుతున్నారు. ఆటపాటలు, సంస్కృతికి కార్యక్రమాలు, విద్యాశాఖ నిర్వహించే పోటీల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహిస్తున్నారు.

మహేశ్వర్‌, ప్రిన్సిపాల్‌, ఆసిఫాబాద్‌ మోడల్‌ స్కూల్‌

అజ్ఞానపు చీకట్లు తొలగించి, జ్ఞాన జ్యోతులు వెలిగించి ప్రతీఅడుగులో మార్గదర్శకులుగా నిలుస్తారు. స్వార్థం లేని త్యాగం, పరిపూర్ణమైన అంకితభావానికి

నిలువెత్తు నిదర్శనం వారే.. తరగతి గదిలో కేవలం బోధనకే పరిమితం కాకుండా చిన్నారులను సమాజంలో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎలా జీవించాలో నేర్పించే దిశానిర్దేశకులు ఉపాధ్యాయులు. తమ శ్రమను ఇంధనంగా మార్చి వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. అలాంటి ఎందరో గురువుల సేవలను స్మరించుకుంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్‌ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ నేపథ్యంలో

జిల్లాలో కొందరు ఉపాధ్యాయులపై ప్రత్యేక కథనం.

ఆసిఫాబాద్‌రూరల్‌: గిరిజన బాలికలను జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో మేటిగా నిలుస్తున్నారు జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో ఖోఖో కోచ్‌ తిరుమల్‌. చిన్నతనం నుంచే క్రీడారంగంపై మక్కువ పెంచుకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఖోఖో క్రీడాకారుడిగా సీనియర్‌ నేషనల్‌ మెడలిస్టుగా నిలిచి 36 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్న ఘన చరిత్ర ఆయనది. ఆ తర్వాత కోచ్‌గానూ 20 సార్లు తెలంగాణ రాష్ట్ర ఖోఖో జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఐదు పతకాలు సాధించి పెట్టి సత్తా చాటారు. ఎన్‌ఐఎస్‌ డిప్లొమా లెవెల్‌ మూడు కోర్సు పూర్తి చేశారు. 2022 నుంచి గిరిజన క్రీడాపాఠశాలలో కోచ్‌గా పనిచేస్తున్నారు. ఆయన శిక్షణలో గిరిజన బాలికలు అద్భుత ప్రతిభ చూపుతున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో 121 మంది విద్యార్థినులు పాల్గొనగా.. 90 బంగారు, 8 వెండి పతకాలు సాధించారు. జాతీయస్థాయి పోటీల్లో 45 మంది పాల్గొనగా 10 మంది జాతీయ మెడలిస్టులుగా నిలవడం గమనార్హం.

ఆసిఫాబాద్‌రూరల్‌: ఆసిఫాబాద్‌ మండలంలోని తుంపెల్లి ప్రాథమికోన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు(ఎస్‌ఏ) నాగేశ్వర్‌ విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా బోధనోపకరణాలు ఉపయోగిస్తున్నారు. పేరుకు తెలుగు టీచరైనా ఆయనకు తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ, గోండి, లంబాడీ, కొలంజీ భాషల్లో ప్రావీణ్యం ఉంది. పాఠశాలలో మరాఠీ, తెలుగు, గోండి మాతృభాష మాట్లాడే విద్యార్థులు మొత్తం 162 మంది ఉన్నారు. తెలుగు పదాల అర్థాలను వారి మాతృభాషలోనే వివరిస్తూ భయం పోగొడుతున్నారు. బోధనలో ఆటపాటలు, ఏఐని జోడిస్తూ చిన్నారులతో మమేకమవుతున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులతో ప్రత్యేక గ్రూపులు తయారు చేసి, వారి స్థాయిలకు అనుగుణంగా బోధన చేస్తున్నారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికై ప్రశంసలు అందుకుంటున్నారు.

కాగజ్‌నగర్‌టౌన్‌: కాగజ్‌నగర్‌ మండలంలోని జీడిచేను ఎంపీపీఎస్‌లో ఎస్జీటీగా పనిచేస్తున్న లావణ్య మూతబడిన పాఠశాలకు ప్రాణం పోసి ప్రవేశాలు పెంచారు. కోవిడ్‌– 19 క్లిష్ట సమయంలో రాష్ట్రస్థాయి క్యూర్‌ కోడ్‌ టీమ్‌లో సభ్యురాలిగా సేవలందించారు. ఒకటో తరగతి తెలుగు విద్యా వీడియోలను రూపొందించి దీక్షా యాప్‌లో అప్‌లోడ్‌ చేయడంలో భాగస్వాములయ్యా రు. పాఠశాలలు మూసివేసిన సమయంలో డిజిటల్‌ విద్యకు తన వంతు సహకారం అందించారు. 2018లో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య లేకపోవడంతో మూసివేశారు. బడిబాట ద్వారా ఇంటింటి ప్రచారం చేసి ప్రభుత్వ పాఠశాలపై నమ్మకాన్ని పెంపొందించారు. అదే విద్యాసంవత్సరంలో 23 మంది విద్యార్థులతో ప్రవేశాలు చేయించారు. 2025– 26 విద్యాసంవత్సరంలో మరో 30 మంది విద్యార్థులకు పాఠశాలలో ప్రవేశాలు ఇప్పించారు. యాక్టివిటీ బేస్డ్‌ లర్నింగ్‌, చైల్డ్‌ సెంటర్డ్‌, జాయ్‌ఫుల్‌ లర్నింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. విద్యార్థులకు క్విజ్‌, వ్యక్తిగత శ్రద్ధ, అభ్యాస మెరుగుదల వంటి కార్యక్రమాలు అమలు చేస్తూ తాము కూడాసాధించగలమనే ఆత్మవిశ్వాసం నింపుతున్నారు.

రెబ్బెన: అంకిత భావంతో విధులు, వినూత్న బోధనలతో తనదైన ముద్ర వేసున్నారు ఉపాధ్యాయురాలు అడ్లూరి లావణ్య. భాషా నైపుణ్యాభివృద్ధి, పాఠశాల అభివృద్ధి, సామాజిక భాగస్వామ్యం వంటి అనేక విభాగాల్లో ఆమె చేస్తున్న సేవలు గుర్తించి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపిక చేశారు. ఒకరిద్దరు హాజరయ్యే ఆ పాఠశాలలో నేడు 53 మంది చదువుకుంటున్నారు. లావణ్య 2010లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం రెబ్బెన మండల కేంద్రంలోని రెబ్బెన ఎస్సీ కాలనీ ఎంపీపీఎస్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. గతంలో ఆమె చేరక ముందు ఇక్కడ విద్యార్థుల సంఖ్య 21 ఉండగా ప్రస్తుతం 53కి చేరింది. అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, గ్రామ యువత, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రవేశాలు పెంచారు. ఆమె మార్గదర్శకత్వంలో ఇద్దరు విద్యార్థులు గురుకుల పాఠశాలకు సైతం ఎంపికయ్యా రు. వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. 3, 4, 5 తరగతుల్లోని తెలుగు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టుల బోధనకు ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ వాడుతున్నారు. 2025– 26 విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో పూర్తిగా ఇంగ్లిష్‌ మీడియం అమలు చేస్తున్నారు.

వినూత్న సేవలకు విశిష్ట గుర్తింపు

సొంత ఖర్చులతో బడి అభివృద్ధి

పాఠశాల సమగ్ర అభివృద్ధికి సొంత డబ్బులు వెచ్చించి సౌకర్యాలు కల్పించారు. సుమారు రూ.లక్షతో ఫర్నీచర్‌ సమకూర్చడంతోపాటు ప్రహరీ, స్కూల్‌లోకి పశువులు రాకుండా గేట్‌ ఏర్పాటు చేయించారు. వరండాలకు గ్రిల్స్‌ అమర్చడం, భవనానికి రంగులు వేయించారు. విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, మధ్యాహ్న భోజన పాత్రలు, స్కూల్‌ బ్యాగులు, నోట్‌బుక్స్‌, పెన్నులు, డైరీలు, స్టేషనరీ, గ్రంథాలయ పుస్తకాలను సమకూర్చారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో నిరంతరం సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తరుచూ పాఠశాలకు గైర్హాజరయ్యే విద్యార్థుల ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు విద్య ఆవశ్యకతను వివరిస్తున్నారు. గైర్హాజరు తగ్గించేందుకు కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

శిక్షణలో మేటి తిరుమల్‌

బహుభాషా కోవిదుడు

మూత‘బడి’కి ప్రాణం పోసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement