ఆసిఫాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలు, ఉపాధి కూలీలు చేపల పెంపకం ద్వారా ఉపాధి అవకాశాలు పొందవచ్చని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వీబీ జీరామ్‌జీ పథకం కింద చేపట్టిన పంట కుంట, నీటి కుంట, ఊట కుంటల్లో ప్రధానమంత్రి కేఏఎస్‌వై ద్వారా జల్ జీవిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో డీఆర్‌డీవో దత్తారావుతో కలిసి చేపపిల్లలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ భూముల్లో ఊట కుంటలు, నీటి కుంటలు, పంట కుంటల నిర్మాణాలు చేపట్టి వాటిలో చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందాలని సూచించారు. చేపపిల్లల పంపిణీకి జల్ జీవిక స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి ఆంజనేయులు, జల్ జీవిక స్వచ్ఛంద సంస్థ సంచాలకులు పద్మాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉమ్మడి సర్వేతో వివాదాలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్‌అర్బన్: భూముల రీ సర్వేలో భాగంగా రెవెన్యూ, అటవీశాఖల మధ్య వివాదాలను ఉమ్మడి సర్వే నిర్వహించి పరిష్కరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఐటీడీఏ పీవో మంద మకరందు, డీఎఫ్‌వో బాలామణి, ఎఫ్‌డీవోలు భార్గవ్, అప్పయ్యతో కలిసి వివిధ శాఖల ద్వారా చేపడుతున్న పనులు, అటవీశాఖ అనుమతుల పురోగతిపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు, పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. టీడబ్ల్యూడీసీ ఆధ్వర్యంలో లింగాపూర్ కేజీబీవీ ప్రహరీ పూర్తి చేయాలని ఆదేశించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన బీటీ రోడ్లు, వంతెనలు, కల్వర్టుల పనులకు అటవీ అనుమతులు పొందాలని సూచించారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో రహదారులు, జీపీ భవనాలు, మండల సమాఖ్య భవనాలు, పనులు త్వరగా చేపట్టాలన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, జియో సంస్థల సెల్ టవర్ల ఏర్పాటు పూర్తి చేసి, మారుమూల గ్రామాలకు సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖ పీడీ ప్రకాశ్‌రావు, పంచాయతీరాజ్ ఈఈ ధర్మేందర్, డీపీవో భిక్షపతిగౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


