కెరమెరి: ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు కెరమెరి మండలంలోని గోయగాం పంచాయతీకి ఆర్వో ప్లాంట్ మంజూరు చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ప్రకటించారు. గురువారం గోయగాం పంచాయతీని సందర్శించి, ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు స్థలాన్ని ఖరారు చేశారు. తాగునీరు సక్రమంగా లేక కిడ్నీ బాధితులు పెరుగుతున్నారని గ్రామస్తులు కలెక్టర్ కె.హరిత దృష్టికి తీసుకెళ్లడంతో ఆర్వో ప్లాంటు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. తరగతి గదులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పల్లె దవాఖానాను సందర్శించగా, వైద్యులు లేక వైద్యం అందడం లేదని స్థానికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో ఎంఎల్‌హెచ్‌పీని పంపిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇంటిని పరిశీలించి లబ్ధిదారుడితో మాట్లాడారు. ఆయన వెంట సర్పంచ్ ఆనంద్‌రావు, ఉప సర్పంచ్ రాందాస్, పంచాయతీ కార్యదర్శి మురళి తదితరులు ఉన్నారు.
నాణ్యమైన విద్యనందించాలి
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ యువరాజ్ మర్మాట్ అన్నా రు. బూర్గుడ ఉన్నత పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, తరగతి గదులు, విద్యాబోధన తీరును పరిశీలించారు. ప్రతీ విద్యార్థి ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. చదువులో వెనుకబడిన వారిని గుర్తించి అవసరమైన అదనపు బోధన చేస్తూ అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సదాశివ్ తదితరులు పాల్గొన్నారు.


