పెంచికల్‌పేట్ మండలం ఎల్లూర్ గ్రామానికి చెందిన 13 ఏళ్ల చిన్నారి రక్త పరీక్ష రిపోర్టు ఇది. పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్‌లో పరీక్షలు నిర్వహించి డెంగీ జ్వరంగా ఆర్‌ఎంపీ నిర్ధారించాడు. అంతేకాకుండా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చిన్నారికి యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్స్ ఇస్తున్నాడు. క్లినిక్‌లో బహిరంగంగానే వైద్యం చేస్తున్నాడు. జిల్లాలోని పలు గ్రామాల్లో డెంగీ అనుమానిత కేసులు పెరుగుతుండగా, ఇదే అదునుగా ఆర్‌ఎంపీలు అర్హత లేని వైద్యం అందిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆర్‌ఎంపీలు రంగంలోకి దిగుతున్నారు. ఎలాంటి అనుమతులు లేని ల్యాబ్స్ ఏర్పాటు చేసి టైఫాయిడ్, మలేరియా, డెంగీ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్లినిక్‌లు, మెడికల్ దుకాణాల్లో బెడ్లు ఏర్పాటు చేసి రోగులకు ప్రమాదకరమైన యాంటీ బయాటిక్ ఇంజెక్షన్లు, స్టెరాయిడ్లు, సైలెన్లు ఎక్కిస్తున్నారు. ఒక్కొక్కరి వద్ద గంపగుత్తగా సుమారు రూ.ఐదు వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆర్‌ఎంపీలు కేవలం ప్రాథమిక చికిత్స మాత్రమే అందించాల్సి ఉండగా, అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిత్యం తనిఖీలు చేస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో ఆర్‌ఎంపీలకు అడ్డూలేకుండా పోయింది. అధికారులు స్పందించి ఇప్పటికై నా స్పందించి అనుమతులు లేకుండా వైద్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పెంచికల్‌పేట్: ఇటీవల కురిసిన వర్షాలకు పల్లెల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారడం, ఎక్కడికక్కడా మురుగు నీరు నిలుస్తుండటంతో జిల్లాలో డెంగీ డెంజర్ బెల్స్ మోగిస్తోంది. పగటి పూట మాత్రమే కుట్టే టైగర్ దోమకాటుతో వ్యాపించే తీవ్రమైన వైరల్ జ్వరమే డెంగీ. సాధారణంగా బాధితులకు తీవ్రమైన జ్వరంతోపాటు నొప్పులు, ఆలసట, బ్లడ్ ప్లేట్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే సరైన నిర్ధారణ లేకుండా చికిత్స తీసుకోవడం ప్రాణాలకే ప్రమాదకరం. కానీ పల్లెల్లో మాత్రం కొందరు ఆర్‌ఎంపీలు అర్హతకు మించి డెంగీ బాధితులకు వైద్యం అందిస్తున్నారు. డెంగీకి నిర్ధిష్టమైన యాంటీ వైరల్ ఔషధం లేదు. ఆర్‌ఎంపీలు మాత్రం స్టెరాయిడ్లు, అధిక డోస్ ఉన్న యాంటీ బయాటిక్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు.
నిర్ధారణ లేని కేసులే అధికం..
గ్రామీణ ప్రాంతాల్లో జ్వర పీడితులు పెరుగుతున్నారు. కానీ ఎక్కువ మంది స్థానిక వైద్యుల వద్దే చికిత్స పొందుతున్నారు. డెంగీ, మలేరియా వంటి జ్వరాలు నిర్ధారణ కావడం లేదు. గతేడాది జిల్లాలో 73 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 27 కేసులు నమోదైనట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. కానీ అధికారికంగా ధ్రువీకరించని కేసుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని సంబంధిత శాఖ అధికారులే చెబుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఒక్క పెంచికల్‌పేట్ మండలం ఎల్కపల్లి గ్రామంలోనే ఈ నెల 1న ఎనిమిది డెంగీ కేసులు వెలుగులోకి రావడం తీవ్రతకు అద్దం పడుతోంది.
చట్ట ప్రకారం చర్యలు తప్పవు
జిల్లాలో అర్హతకు మించి వైద్యం అందిస్తున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలపై చర్యలు తప్పవు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రజలు అర్హత లేని వైద్యుల వద్దకు వెళ్లవద్దు. నిబంధనలు ఉల్లఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవు.
– డా.నాగేంద్ర, జిల్లా వైద్యారోగ్య అధికారి
జిల్లాలో డెంగీ కేసుల వివరాలు
సంవత్సరం కేసులు
2025 73
2026(ఇప్పటివరకు) 27


