‘సరిహద్దు’ దొంగలు! | - | Sakshi
Sakshi News home page

‘సరిహద్దు’ దొంగలు!

Sep 3 2026 4:09 AM | Updated on Sep 3 2026 4:09 AM

● జిల్లాలో పెరుగుతున్న చోరీలు ● కేసుల పరిష్కారం, నగదు రికవరీలో తీవ్ర జాప్యం!

మహారాష్ట్రకు చెందిన ముఠాలపైనే అనుమానాలు

చింతలమానెపల్లి: జిల్లాలో వరుస చోరీ ఘటనలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా సిర్పూర్‌ నియోజకవర్గంలోని మహారాష్ట్ర సరిహద్దు మండలాలను టార్గెట్‌ చేయడం ఆందోళన కలిగిస్తున్నాయి. సరిహద్దు దాటి వస్తున్న కొందరు చోరీలకు పాల్పడి రైలు, రోడ్డు మార్గాల్లో దర్జాగా వెళ్తున్నారని తెలుస్తోంది. జిల్లా నుంచి మహారాష్ట్రకు రైలు, రోడ్డు రవాణా మార్గాలు ఉండటం, చింతలమానెపల్లి, సిర్పూర్‌(టి) మండలాల నుంచి రహదారులు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్నాయి. గతేడాది కౌటాల మండల కేంద్రం, చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలో దొంగతనాలకు పాల్పడినవారు మహారాష్ట్రకు చెందిన వారే కావడం గమనార్హం. మూడేళ్ల క్రితం చింతలమానెపల్లి మండలం రవీంద్రనగర్‌ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో జరిగిన దోపిడీకి చంద్రాపూర్‌ జిల్లాలో జరిగిన పలు బ్యాంకుల దొంగతనాలకు సంబంధం ఉందని సమాచారం.

వర్షాకాలంలోనే అధికం..

మూడేళ్ల క్రితం సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ధనలక్ష్మి నగల దుకాణంలో సుమారుగా రూ.40లక్షల విలువైన బంగారం చోరీకి గురైంది. జూలైలో భారీ వర్షం కురుస్తుండగా దుకాణం షెట్టర్‌ తొలగించిన బంగారాన్ని దొంగిలించారు. భారీ వర్షం కారణంగా పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహించలేకపోయారని ఓ పోలీసు అధికారి చెప్పడం విశేషం. ముఖాలకు మాస్కులు వేసుకోవడంతో దొంగలు నేటికీ చిక్కలేదు. కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి)లతోపాటు మహారాష్ట్రలో సరిహద్దున రాజురా, బల్లార్షా, చంద్రపూర్‌ పట్టణాలు సమీపంలోనూ రైల్వేస్టేషన్లు ఉన్నాయి. వర్షాకాలం రాత్రిపూట జరిగే చోరీలు ఎక్కువగా రైలు ఆగే ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. చోరీలకు పాల్పడే వారు ఎక్కువగా బంగారం, నగదు లక్ష్యంగా చేసుకుంటున్నారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో జరిగిన దొంగతనాల్లో బాధితులు ఎక్కువగా బంగారం నష్టపోయారు. సీసీ కెమెరాలు, సెక్యూరిటీ చర్యలు తీసుకునే నగల దుకాణాల్లో ఈ చోరీలు జరగడం గమనార్హం. సిర్పూర్‌ నియోజకవర్గంలో జరిగే చాలావరకు చోరీల్లో ముఠాలు పోలీసులకు చిక్కడం లేదు. సొమ్ము రికవరీలో పోలీసులు విఫలమవుతున్నారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నా ఫలితం ఉండడం లేదు. ప్రధాన ముఠాలు, పెద్ద దొంగతనాలు పరిష్కారం కాకపోవడంతోపాటు గ్రామాల్లో చిల్లర దొంగతనాలు కూడా పెరుగుతున్నాయి. సీసీ కెమెరాలకు చిక్కినా ప్రయోజనం ఉండటం లేదు.

నేరాలు అరికట్టేందుకు చర్యలు

నేరాలు అరికట్టడానికి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నాం. దొంగతనాలు జరిగిన సందర్భాల్లో నిందితులు నగదు ఖర్చు చేస్తే రికవరీ చేయడం కష్టంగా మారుతుంది. బంగారం, నగలు మాత్రం పూర్తిస్థాయిలో రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నిందితులను పట్టుకునేందుకు ఆధునిక టెక్నాలజీ వినియోగిస్తున్నాం.

– వహీదుద్దీన్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీ

చింతలమానెపల్లి మండలం డబ్బాలో గతేడాది జూన్‌లో ఓ ఫర్టిలైజర్‌ దుకాణంలో చోరీ జరిగింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తులు రూ.85వేల నగదు అపహరించారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన నిందితులను పోలీసులు పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. ఇది జరిగిన రెండు రోజుల్లోనే బెజ్జూర్‌ మండలంలోని ఒక ఫర్టిలైజర్‌ దుకాణం, కౌటాల మండలంలోని ఒక ఉపాధ్యాయుడి ఇంట్లోనూ చోరీలు జరిగాయి. ఇదే తీరుగా ఇటీవల జరుగుతున్న పలు చోరీల్లోనూ మహారాష్ట్రకు చెందిన వారి హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement