తగ్గిన వర్షపాతంతో పెరిగిన ఖైరిగూర ఓసీపీ బొగ్గు ఉత్పత్తి అనుకూలంగా మారిన వర్షాభావ పరిస్థితులు లక్ష్య సాధన వైపు వేగంగా అడుగులు
(మెట్రిక్ టన్నులు)
రెబ్బెన: ఎల్‌నినో కొన్ని రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపించగా సింగరేణికి మాత్రం అనుకూలంగా మారింది. వర్షాభావ పరిస్థితులు బొగ్గు ఉత్పత్తికి కలిసొచ్చాయి. ఓపెన్ కాస్టు ప్రాజెక్టుల్లో మిగిలిన సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలో బొగ్గు ఉ త్పత్తికి తరుచూ ఆటంకాలు ఎదురవుతుంటాయి. ముసురుకు ఎక్కడిక్కడ పనులు నిలిచిపోతాయి. క్వారీలు నీటితో నిండటంతోపాటు డంపర్లు ఉపరి తలానికి వచ్చే రోడ్లు బురదమయంగా మారుతా యి. వర్షం తగ్గిన తర్వాతే ఉత్పత్తి తిరిగి ప్రారంభి స్తారు. ఈ కారణాలతో నాలుగు నెలలపాటు లక్ష్యం సాధించడం కష్టంగా మారుతుంది. కానీ ఈసారి వర్షాలు తక్కువగా కురవడంతో బొగ్గు ఉత్పత్తి పెరిగింది. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగూర ఓసీపీ గతేడాదితో పోలిస్తే అధిక ఉత్పత్తి సాధించి లక్ష్య సాధన వైపు దూసుకుపోతుంది. ఈ నెల నుంచి ఉత్పత్తి ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
తగ్గిన వర్షం.. పెరిగిన ఉత్పత్తి
బెల్లంపల్లి ఏరియాలో ఒక్క ఖైరిగూర ఓసీపీలో మాత్రమే బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది. గోలేటి ఓసీపీ ఏర్పాటు కోసం అధికారులు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నా అనుమతులు రాలేదు. ఏరియాకు ఈ ఓసీపీనే పెద్దదిక్కుగా ఉంది. ఎల్‌ని నోతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సింగరేణికి అనుకూలంగా మారాయి. ఈ ఏడాది వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో బొగ్గు ఉత్పత్తిపై అంతగా ప్రభావం చూపలేదు. గత మూడు, నాలుగు సంవత్సరాల్లో వర్షాకాలం సీజన్లతో పోల్చితే ఈసారి ఉత్పత్తి కాస్త పెరిగింది. గతేడాది వర్షాకాలంలో ఒక నెలలో ఏకంగా 20రోజులకు పైగా ఉత్పత్తి నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. జూన్‌లో వర్షాకాల సీజన్ మొదలు కాగా ఆగస్టులో వర్షాలు అధికంగా కురుస్తాయి. కానీ ఈసారి పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. అయితే 2025 ఆగస్టులో ఏరియాలో 742 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఈసారి మాత్రం కేవలం 274 మి.మీ.లు మాత్రమే వర్షం కురిసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు బెల్లంపల్లి ఏరియాలో 11,75,504 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపడితే ఈసారి మాత్రం 14,06,446 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సాధ్యమైంది.
ఖైరిగూర ఓసీపీ
మూడేళ్లలో ఉత్పత్తి ఇలా (ఏప్రిల్ నుంచి ఆగస్టు)
సంవత్సరం లక్ష్యం ఉత్పత్తి
2024 15,50,000 13,32,584
2025 13,00,005 11,75,504
2026 11,92,000 14,06,446
బెల్లంపల్లి ఏరియాలో నమోదైన వర్షపాతం(మి.మీ.)
నిరాటంకంగా పనులు
వర్షాకాలం నాలుగు నెలల పాటు సింగరేణిలో ప్రధానంగా ఓసీపీల్లో ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. వర్షాలతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో డంపర్లు, షావెల్స్ వంటి ఖరీదైన భారీ యంత్రాలు పనులు లేక నిరుపయోగంగా ఉంటాయి. ఎడతెరిపి లేకుండా ముసురు వానలు కురిస్తే కొన్నిసార్లు వారం రోజుల పాటు బొగ్గుపెల్ల కూడా బయటికి రాదు. కానీ ఈసారి ఎల్‌నినో ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతగా అంతరాయం కలగలేదు. వర్షం కురిసిన రోజులు తక్కువగా ఉండటంతో పనులు నిరాటంకంగా కొనసాగాయి. ఏకధాటిగా వర్షాలు పడితే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగుల జీతాలు, యంత్రాల పనిగంటలను సింగరేణి భరించుకోవాల్సి వస్తుంది. వర్షాలతో బొగ్గు ఉత్పత్తి తగ్గి సాధించిన కొద్దిపాటి ఉత్పత్తిపైనే వ్యయం అంతా పడుతుంది. దీంతో వర్షాకాలంలో నాలుగు నెలల పాటు బొగ్గు ఉత్పత్తి వ్యయం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. దానిని నివారించేందుకు అధికారులు వర్షాలు తగ్గుముఖం పట్టాక ఉత్పత్తి ప్రక్రియలో వేగం పెంచుతారు. ఏటా అక్టోబర్ నుంచి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ పుంజుకుంటుంది. వర్షాలతో కోల్పోయిన ఉత్పత్తిని సాధించేందుకు శ్రమిస్తుంటారు. అయితే ఈ సారి ఉత్పత్తి పెరిగిన కారణంగా ఏరియా వార్షిక లక్ష్యాన్ని సులువుగా సాధించే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.


