1,05,800 మందికి నోటీసులు | - | Sakshi
Sakshi News home page

1,05,800 మందికి నోటీసులు

Sep 2 2026 2:58 AM | Updated on Sep 2 2026 2:58 AM

● ‘సాక్షి’తో ఆర్డీవో లోకేశ్వర్‌రావు

ఆసిఫాబాద్‌: జిల్లాలో ఎస్‌ఐఆర్‌ కార్యక్రమంలో భాగంగా 1,05,800 మందికి నోటీసుల జారీ చేయనున్నట్లు ఆర్డీవో లోకేశ్వర్‌రావు తెలిపారు. జిల్లాలో నోటీసుల జారీ, హియరింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మంగళవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే.. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లి నవారు, నకిలీ, డబుల్‌ ఓట్లను ఏరివేసేందుకు ఎస్‌ఐఆర్‌– 2026 ప్రక్రియ చేపట్టాం. తొలిదశలో గడపగడపకూ సర్వే చేపట్టి ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించాం. గ్రామ సభలు నిర్వహించి ముసాయిదా ఓటరు జాబితా ప్రకటించాం. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాల్లోని 684 పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో 4,07,457 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 84,930 మందిని అనామలిస్‌ ఓటర్లుగా గుర్తించాం. మొత్తం 1,05,800 మందికి నోటీసుల జారీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 14,960 మందికి నోటీసులు అందించాం. నోటీసులు జారీ చేసిన వారికి హియరింగ్‌ కండక్ట్‌ చేస్తున్నాం. బీఎల్‌వోల సమక్షంలో తహసీల్దార్లు హియరింగ్‌ చేస్తున్నారు. కొన్నిసారు గ్రామాలు, మరికొన్ని సార్లు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

వారికి ఒకేచోట ఓటు

సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు మహారాష్ట్రలోనూ ఓటుహక్కు కలిగి ఉన్నారు. ఇందులో దాదాపు 70 శాతం మంది ఓటర్లు ఎన్యూమరేషన్‌ ఫారాలు అందించారు. వీరు మహారాష్ట్రలో కూడా నమోదైతే ఎన్నికల నిబంధనల ప్రకారం చివరగా ఏదో ఒక ఓటు మాత్రమే ఉంటుంది.

ధ్రువపత్రాలు అందించాలి

2022కి ముందు ఓటరుగా ఉన్నవారు ఎలాంటి ఆధారాలు సమర్పించాల్సిన అవసరం లేదు. 2002 తర్వాత ఓటరుగా నమోదై మ్యాపింగ్‌ కాని వారు ప్రభుత్వం నుంచి పొందిన భూమి, ఇల్లు ధ్రువపత్రాలు సమర్పిస్తే చాలు. అనామలిస్‌, అన్‌మ్యాప్‌డ్‌ ఓటర్లు మాత్రం తహసీల్దార్‌ నుంచి జారీ చేసిన కులం, నివాసంతోపాటు 12 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి అందించవచ్చు. విదేశాల్లో ఉన్న ఓటర్లను ఓవర్‌సీస్‌ సెక్టార్లు అంటారు. వారు వాళ్లకు సంబంధించిన వ్యక్తుల నుంచి ధ్రువీకరణ పత్రాలు సమర్పించవచ్చు. నోటీసులు పొందిన వారు ఏదైనా అనివార్య కారణాలు ఉంటే నోటీసు ఇచ్చిన ఐదు రోజులలోపు ఎవరైనా వచ్చి రీ షెడ్యూల్‌ చేసుకోవచ్చు. షెడ్యూల్‌కు ముందు రోజు కూడా ధ్రువపత్రాలు అందించవచ్చు. అందుబాటులో లేనివారు ఆన్‌లైన్‌లో కూడా డాక్యుమెంట్లు సమర్పించవచ్చు. ముసాయిదాలో పేరు లేకుంటే ఫామ్‌ 6తో కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. వివరాలు తప్పుగా ఉన్నవారు ఫామ్‌ 8తో సవరించుకోవాలి. అక్టోబర్‌ 19న తప్పులు లేని తుదిఓటరు జాబితా ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. 18 ఏళ్లు నిండిన అర్హులందరికీ ఓటుహక్కు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement