కౌటాల: వర్షాకాలం వస్తూనే సీజనల్ వ్యాధులను వెంటేసుకుని వస్తుంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాలో గత వారంలో వర్షాలు కురిశాయి. దీంతో పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తోంది. దీంతో నీరు, ఆహారం కలుషితమై వ్యాధులు ప్రబలుతుండడంతో వారం రోజులుగా జిల్లాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరిగింది. అందుకే ఈ కాలంలో నిర్లక్ష్యంగా ఉండకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, ఆహార నియమాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
అతిసారతో అతి జాగ్రత్త..
కలుషిత నీరు, ఆహారం ద్వారానే అతిసార సోకుతుంది. రోగికి రోజులో 10 నుంచి 20 సార్లు నీళ్ల విరేచనాలు అవుతాయి. వాంతులు కూడా అవుతాయి. రోగి త్వరగా డీహైడ్రేషన్ దశకు చేరుతాడు. ఈ వ్యాధి చిన్నారులు, మధుమేహ రోగులు, ఇతర దీర్గకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కళ్లు లోతుకుపోవడం, బాగా నీరసించడం, చురుకు దనం తగ్గిపోయి మాట్లాడలేకపోవడం, రక్తపోటు పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి మూత్రం కూడా అతిగా పోవడం వల్ల కిడ్నీలపై ప్రభావం పడుతుంది. రోగిని త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి.
డేంజర్.. డయేరియా..
కలుషిత నీరు, ఆహారం, నిల్వ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వలన డయేరియా సోకుతుంది. వ్యాధి సోకిన వారికి నీళ్ల విరేచనాలు కావడంతో పాటు జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. రోజుకు నాలుగు ఉంచి ఐదు సార్లు విరేచనాలు అయితే డయేరియాగా గుర్తించాలి. ఎక్కువ సార్లు విరేచనాలు కావడం వల్ల శరీరంలోని నీరు, లవణాలు, పొటాషియం, గ్లూకోజ్ శాతం తగ్గిపోయి రోగి షాక్‌లోకి వెళ్తాడు. రక్తపోటు తగ్గిపోవడంతో పాటు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోజులో రెండు, మూడు సార్లు నీళ్ల విరేచనాలు అయినప్పుడు తక్షణమే వైద్యుడిని ఆశ్రయించాలి.
దోమతో మలేరియా
వర్షాకాలంలో దోమకాటుతో వచ్చే వ్యాధుల్లో మలేరియా ఒకటి. ప్లాస్మోడియం పరాన్న జీవి అనాఫిలస్ కల్సిఫేసిస్ దోమ కాటు ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు మురుగు కాల్వల్లోని మంచినీటిలో వృద్ధి చెందుతాయి. మలేరియాలో ప్లాస్మోడియం వైవాసి(పీవీ), ప్లాస్మోడియం ఫాల్సీఫారమ్(పీఎఫ్) రెండు రకాలు ఉంటాయి. వీటిలో పీఎఫ్ అత్యంత ప్రమాదకరం. దీనిని సకాలంలో గుర్తించి చిక్సిత చేయకపోతే దీని ప్రభావం లివర్, కిడ్నీ, గుండె, రక్తనాళలు, మెదడుపై పడుతుంది. ఒక్కో సమయంలో రోగి ప్రాణాప్రాయస్థితికి చేరుతాడు. కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. మలేరియా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. దోమ కుట్టిన 10 నుంచి 14 రోజుల్లో మలేరియా వ్యాధి లక్షణాలు బయట పడతాయి. రోజు విడిచి రోజు జర్వం రావడం, తలనొప్పి, ఒంటి నొప్పులు, చలి ఎక్కువగా ఉంటాయి. చెమటలు పట్టడం, కొన్నిసార్లు వాంతులు అవుతాయి.
వైరల్ ఫీవర్ (విషజ్వరం)తో జాగ్రత్త సుమా..
వాతావరణంలో మార్పులు, కొన్ని రకాల వైరస్‌ల కారణంగా వైరల్ ఫీవర్ సోకుతుంది. ఇంట్లో ఒకరికి విషజ్వరం వస్తే మిగిలిన స భ్యులు కూడా వ్యాధి బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీని ప్రభావం వారం నుంచి పది రోజుల పాటు ఉంటుంది. రోగికి 103 నుంచి 107 డిగ్రీల సెల్సియస్ ఫారిన్ హీట్ వరకూ జ్వరం వస్తుంది. గొంతునొప్పి, జలుబు, ఆక లి మందగించడం, తలనొప్పి, ఒంటి నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరికి వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. ఇంటి వద్దే ఉండి చికిత్స పొందవచ్చు. పరిస్థితి విషమిస్తే సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించాలి. వర్షాకాలంలో అతిసార, మలేరియా, డయేరియా, వైరల్ ఫీవర్, తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు తప్పనిసరిగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.


